‘సైరా’ సెట్ కూల్చేసిన అధికారులు
‘సైరా’ సెట్ కూల్చేసిన అధికారులు

చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ శేరిలింగంపల్లి అధికారులు కూల్చివేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.

రెవెన్యూ అధికారులు, సిబ్బంది తెలిపిన వివరాలప్రకారం, శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌ గుట్టలబేగంపేట ప్రాంతంలోని కొండలపై గతంలో ‘రంగస్థలం’ సినిమా సెట్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఇది గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి రాలేదు. ఇటీవల అవే సెట్టింగులను మారుస్తూ ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి చేరడంతో శేరిలింగంపల్లి తహశీల్దార్‌ తిరుపతిరావు, ఆర్‌ఐ నిహాంత్‌తో సిబ్బంది సైరా యూనిట్‌ సభ్యులను సంప్రదించారు. జిల్లాకలెక్టర్‌ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో సెట్టింగ్‌ ఎలా ఏర్పాటు చేస్తారనీ, అనుమతి తీసుకోవాలని కోరారు.

ఇలా పలుమార్లు తెలిపినా వారినుంచి స్పందనరాకపోవడంతో మంగళవారం రెవెన్యూ అధికారులు సెట్టింగ్‌ను స్వల్పంగా కూల్చివేసి వచ్చారు. ఓ ప్రైవేటువ్యక్తి వద్ద అనుమతి తీసుకొని సెట్టింగులు ఏర్పాటు చేశామని యూనిట్‌వారు తెలుపగా, రెవెన్యూ అధికారులు ఆక్షేపించారు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించడానికి ఆస్కారం అందించడమేనని వారు స్పష్టం చేశారు.

Posted On 2nd August 2018