APకి మరో ఫోన్ తయారీ పరిశ్రమ
APకి మరో ఫోన్ తయారీ పరిశ్రమ

ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ విభాగంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది. ఫోన్ల విడిబాగాలను తయారుచేసే చైనా కంపెనీ హోలీటెక్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

మొత్తం రూ.1400 కోట్ల పెట్టుబడిని హోలీటెక్‌ పెట్టనుంది. ఈ పరిశ్రమ ద్వారా 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తిరుపతిలో 75 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెలా 5 కోట్ల మొబైల్‌ విడి భాగాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించాలని హోలీ టెక్‌ కంపెనీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ "దేశంలో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో 29% రాష్ట్రంలోనే తయారవుతున్నాయని, 240 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి కావాలన్నది తమ లక్ష్యమని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు రకాల వస్తువులను హోలీటెక్‌ తయారుచేస్తుందని తెలిపారు.”

షామీ ఇండియా హెడ్‌ మనుజైన్‌ మాట్లాడుతూ "ప్లాంట్‌ ఏర్పాటు గురించి అనేక రాష్ట్రాలను సంప్రదించామని, ఏపీలో మాత్రమే నమ్మకమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. షామీ ఫోన్ల విడిభాగాలను హోలీటెక్‌ తయారు చేస్తుందని తెలిపారు.”

Posted On 6th August 2018