అమరావతి బాండ్లు... గంటలో 2000 కోట్లు
అమరావతి బాండ్లు... గంటలో 2000 కోట్లు

  • అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన 
  • ఒక గంటలోనే రూ.2 వేల కోట్లు 
  • 27న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదు 
  • ఇదే ఉత్సాహంతో రీటెయిల్‌ బాండ్లు

రాజధాని నిర్మాణానికి నిధుల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లోని ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫాంపై మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు బిడ్డింగ్‌ నిర్వహించగా... గంట వ్యవధిలోనే సంస్థాగత మదుపరుల నుంచి రూ.2 వేల కోట్ల నిధులు సమకూరాయి. మొదట బిడ్డింగ్‌కు ఉంచిన రూ.1300 కోట్ల బాండ్ల కొనుగోలుకే 1.53 రెట్లు స్పందన వచ్చింది. దాంతో సీఆర్‌డీఏ మరో రూ.700 కోట్లను కూడా బిడ్డింగ్‌కు ఉంచింది. ఎలాంటి తనఖాలు లేకుండానే, కేవలం రాజధాని ప్రాజెక్టుపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా నమ్మకంతో సంస్థాగత మదుపరులు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం వల్ల దేశ, విదేశాల్లో అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందన్న భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సారథ్యంలో సీఆర్‌డీఏ  అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. సీఆర్‌డీఏ కమిషర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రత్యేక కమిషనర్‌ రామమనోహర్‌రావులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

బీఎస్‌ఈలో లిస్టింగ్‌ కార్యక్రమానికి సీఎం 
అమరావతి బాండ్లను ఈ నెల 27న బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవనున్నారు. ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అమరావతి బాండ్లను బీఎస్‌ఈలో నమోదు చేశాక... సెకండరీ మార్కెట్‌లో క్రయవిక్రయాలకు వీలుంటుంది. అంటే బాండ్లు కొనుగోలు చేసినవారు... మరొకరికి వాటిని విక్రయించుకోవచ్చు.

10.32 శాతం వడ్డీ ప్రత్యేక ఆకర్షణ 
సీఆర్‌డీఏ అధికారులు అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. ముంబయి నుంచి కొందరు మదుపరులు వచ్చి రాజధానిలో జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లారు. ఆ తర్వాతే బాండ్లలో మదుపు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గడచిన 30-40 ఏళ్లలో దేశంలోని వివిధ మున్సిపాలిటీలు బాండ్లు విడుదల చేసి సమీకరించిన మొత్తం రూ.1800 కోట్లయితే, తాము అమరావతి బాండ్ల ద్వారా ఒక్క రోజే రూ.2 వేల కోట్లు సమీకరించామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రాజధాని నగర నిర్మాణం కోసం ఇలా నిధులు సమీకరించడం దేశంలో మొదటిసారని పేర్కొన్నారు.

మూణ్నాలుగు నెలల్లో రీటెయిల్‌ బాండ్లు 
అమరావతి బాండ్లు విజయవంతమైన ఉత్సాహంతో మరో మూడు నాలుగు నెలల్లో రీటెయిల్‌ బాండ్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. సాధారణ ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా కనీసం రూ.100 పెట్టుబడి పెట్టేలా వీటిని మార్కెట్‌లోకి తెస్తామన్నారు. వడ్డీ ఎంత ఉండాలి వంటి విషయాలపై త్వరలో ఒక స్పష్టతకు వస్తామన్నారు. సింగపూర్‌, లండన్‌, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిల ద్వారా ఆయా దేశాల్లో బాండ్ల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో డాలర్ల రూపంలోను, రూపాయి మారకంలోను బాండ్లు జారీ చేయవచ్చు.

కేంద్రం కళ్లు తెరవాలి: నారాయణ 
ఈ బాండ్ల ఫలితాలను చూసి కేంద్రం కళ్లు తెరవాలని పురపాలక మంత్రి పి.నారాయణ అన్నారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి రాష్ట్రం పంపిన డీపీఆర్‌కి అనుగుణంగా సహాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ఐదేళ్ల తర్వాతే అసలు చెల్లింపు..! 
* అమరావతి బాండ్ల కాలపరిమితి పదేళ్లు. ఐదేళ్లపాటు మూణ్నెల్లకోసారి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఆరో సంవత్సరం నుంచి ఏటా అసలులో ఏటా 20 శాతం చొప్పున సీఆర్‌డీఏ తిరిగి చెల్లిస్తుంది. 
* బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటే... దాన్ని ఏ ప్రాజెక్టు కోసం తీసుకుంటే దానిపైనే ఖర్చు చేయాలి. సీఆర్‌డీఏ కొంత మ్యాచింగ్‌ ఫండ్‌ పెట్టాలి. పైగా భూముల్ని, భవనాల్ని తనఖాగా పెట్టాలి. బాండ్లకు ఆ సమస్య లేదు. వచ్చిన డబ్బుని తమ అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులపై ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Posted On 15th August 2018

Source eenadu