కలెక్టర్‌ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం

వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ దయ్యం అంటే చాలా భయమని, తన ఇంట్లోనే దయ్యం ఉందని చెప్పారు. ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు నిండింది. ఈ సందర్భంగా తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి ఓ టీవీ ఛానెల్‌కు ఆసక్తికర సంగతులు చెప్పారు.

‘జార్జ్‌ పామర్‌ అనే ఆయన భార్య వరంగల్‌ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. జార్జ్‌ పామర్‌ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తితో కొన్ని నెలలుగా శోధించా. నిజాం కాలంలో ఆయనో గొప్ప ఇంజినీర్‌ అని తెలిసింది. ఆమె భార్య కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్తులో దెయ్యం ఉందని నాతో చెప్పారు. నేను బాధ్యతలు తీసుకున్నాక పైకి వెళ్లి చూస్తే గదంతా చిందరవందరగా పడి ఉండడంతో దాన్ని సర్ది పెట్టించాను. అయినా కూడా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించను’ అని ఆమ్రపాలి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Posted On 15th August 2018