వాజ్‌పేయి కన్నుమూత
వాజ్‌పేయి కన్నుమూత

మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి (93) ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ AIMSలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు.

డెమెన్షియా, మధుమేహం, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 2018 జూన్‌ 11వ తేదీన AIMSలో చేరారు. గడిచిన రెండు మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచారు.

అటల్ బిహారీ వాజ్‌పేయీ డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ దంపతుల కు జన్మించారు. ఆయన గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌ లో ప్రాధమిక విద్యాభ్యాసం తో ప్రారంభించి, విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.

10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, మూడు సార్లు ప్రధానమంత్రిగా వాజ్‌పేయీ సేవలందించారు.

1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు.
భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Posted On 16th August 2018