తెలంగాణ RTC బస్సు బోల్తా... 56 మంది మృతి
తెలంగాణ RTC బస్సు బోల్తా... 56 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద సుమారు 88 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కొండగట్టు ఘాట్‌ రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 56 మంది మృతిచెందారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయాలపాలైన ఎనిమిది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 25 మంది మహిళలే ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఈ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డు పైకి ఎక్కుతున్న సమయంలో చివరి మూలమలుపు స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా లోయలో పడింది. ఈ బస్సు శనివారంపేట నుంచి బయల్దేరినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతిచెందగా, కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు.

కాసుల కక్కుర్తి 45మంది ప్రాణాలు తీసింది

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో కాసులకు కక్కుర్తి పడి 80మందిని ఎక్కించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట్ల కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నచోట్ల.. స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ ఎలాంటి గుర్తులు లేవు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే... స్పీడ్ బ్రేకర్ ఉన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ వేగంగా రావడం వల్ల ప్రయాణికులు ఎగిరిపడ్డారు. అదే సమయంలో డ్రైవర్ వెనుక పక్క కూర్చున్న ప్రయాణికులు పట్టు తప్పి డ్రైవర్‌పై పడటంతో స్టీరింగ్ పట్టు తప్పి బస్సు పక్కనే ఉన్న గుంటలో పడింది.

బస్సు పడిన ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లుండటం, వాటిపై బస్సు పడటంతో అవి గుచ్చుకుని కొందరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారపు పేట నుంచి జగిత్యాల వెళ్లే మార్గం ఇది కాదని, ఈ మార్గంలో వెళితే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతారన్న ఆశతో బస్సు ఈ మార్గం గుండా తీసుకొచ్చారని స్థానికులు చెప్పారు. అసలు వెళ్లాల్సిన మార్గంలో వెళితే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్ కేవలం భక్తుల కోసం వేసిన ఘాట్ రూట్ అని, ఆర్టీసీ సర్వీస్ రూట్ కాకపోయినా బస్సు ఈ మార్గంలో రావడం వల్లే ఘటన జరిగిందని స్థానికులు స్పష్టం చేశారు. జగిత్యాల డిపో మేనేజర్ ఈ రూట్‌లో బస్సులు నడిపేందుకు అనుమతినివ్వడంతో, గత కొద్దిరోజులుగా ఇటువైపు బస్సులు నడుస్తున్నాయని.. ఆర్టీసీ కాసుల కక్కుర్తి 45మంది ప్రాణాలు తీసిందని స్థానికులు చెప్పారు.

Posted On 11th September 2018