జనసేన అభ్యర్థిగా బాలకృష్ణ
జనసేన అభ్యర్థిగా బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు పోటీ చేసే తొలి అభ్యర్థిని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ, ‘బాలకృష్ణ ఇటీవల నన్ను కలిశారు. రండి మాట్లాడదాం. అని చెప్పా. కానీ, సీటు ఇస్తానని చెప్పలేదు. నేను ఈ రోజు చెబుతున్నా. ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతా. ఒకవేళ దాని వల్ల నష్టం వచ్చినా పర్వాలేదు. ఎవరు పార్టీ పెట్టినా, దానికి కులం పేరు ఆపాదిస్తారు. నేనూ అంబేడ్కర్‌ను ప్రేమిస్తాను. ఆయన మహనీయుడు. ఆయన ఆశయాల సాధనకు నా వంతు కృషి చేస్తా. కులాల ఐక్యత అవసరం. ఫలానా కులంలో పుట్టాలని మనం అనుకుని పుట్టలేదు. మన ఆలోచనా స్థాయి మారాలి. పితాని బాలకృష్ణ బలమైన వ్యక్తి. బాగా మాట్లాడతారు. జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం ఇచ్చే మొదటి వ్యక్తి ఆయనే’ అని అన్నారు.

Posted On 11th September 2018

Source eenadu