APలో పెట్రోలు, డీజిల్‌పై ధర తగ్గింపు
APలో పెట్రోలు, డీజిల్‌పై ధర తగ్గింపు

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున వ్యాట్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.1,120 కోట్ల ఆదాయం తగ్గనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శాసనసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ప్రజలపై కేంద్రం మోపిన ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం కూడా ధరలు తగ్గించాల్సిందే. ఇది సవాలు. వారు స్పందించాల’ని అన్నారు.

పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా భాజపా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. అస్తవ్యస్త పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. పెట్రో ధరలపై చర్చ సందర్భంగా వ్యాట్‌ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ అభినందించింది. కేంద్రం కూడా బాధ్యతగా ఎక్సైజ్‌ పన్ను, సెస్‌ గణనీయంగా తగ్గించడంతోపాటు ఉపశమన చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ‘చమురు సంస్థలు రోజురోజుకు పెట్రోలు, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచడంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రతిపక్షాల బంద్‌కు వచ్చిన విశేష స్పందనే దీనికి నిదర్శనం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను, డివిడెండ్ల రూపంలో నాలుగేళ్లలో రూ.23లక్షల కోట్లకుపైగా వసూలు చేశారు. ఏమైందీ సొమ్మంతా? ఎక్కడ ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం విడుదల చేయండి’ అని డిమాండ్‌ చేశారు. ‘ముడిచమురు గరిష్ఠ స్థాయికి వెళ్లలేదు. 117 డాలర్లు.. ఆపైకి వెళ్లే పరిస్థితి ఉంది. అప్పుడు చాలా సమస్యలొస్తాయి’ అని చంద్రబాబు ఆందోళన వెలిబుచ్చారు.

కేంద్రం అబద్ధపు ప్రచారం.. అంతర్జాతీయ విపణిలో పెట్రోలియం ధరలు పెరగడం, రాష్ట్రాలు వ్యాట్‌ పెంచడం వల్ల ధరలు పెరిగాయని కేంద్రం అబద్ధపు ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహించారు. కేంద్రంలో భాజపా వచ్చాకే భారీగా ఎక్సైజ్‌ పన్నులు వేయడంతోపాటు రహదారి, మౌలిక సదుపాయాల పేరుతో సెస్‌లు వసూలు చేస్తున్నదని గుర్తు చేశారు. నాలుగేళ్లలో రూ.23లక్షల కోట్లకుపైగా వసూలు చేశారని వివరించారు. ‘పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రం ఏకపక్ష విధానాలే కారణం. నిరంకుశంగా వ్యవహరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసుల మాఫీ కోసమే వైకాపా కేంద్రానికి సహకరిస్తోంది. అది ఒక పార్టీయేనా? పెట్రోధరలు పెరుగుతుంటే కనిపించదా? నిరసనలు చేయాలనే ఆలోచన కూడా లేదు’ అని ధ్వజమెత్తారు. భాజపా ఆడిస్తున్న పార్టీలు తప్పితే అన్ని పార్టీలు ఈ ధరలపై ఆందోళన చేస్తున్నాయని గుర్తు చేశారు. జగన్‌కు, తమకు సంబంధం లేదని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించినప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. ‘మీకు తెలుసా? చూపించమంటారా?’ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలను రూ.2 చొప్పున తగ్గించడం వల్ల పక్కనున్న తెలంగాణతో పోలిస్తే కాస్త ఉపశమనమే లభించినట్లయింది. లీటరుకు రూ.4 చొప్పున అదనంగా ఉన్న పన్నులో రెండు రూపాయలు తగ్గాయి. తెలంగాణతో పోలిస్తే లీటరు పెట్రోలుపై 53 పైసలు, డీజిల్‌పై 89 పైసలు తగ్గాయి. ప్రస్తుతం ఒడిశాలో ఉన్న డీజిల్‌ ధరతో మన వద్ద దాదాపు సమానమైంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాతోపాటు యానాంలోనూ ధరలు ఇప్పటికీ మనకంటే తక్కువే.

Posted On 10th September 2018

Source eenadu