ఐక్యరాజ్య సమితి వేదికపై... చంద్రబాబు ప్రసంగం
ఐక్యరాజ్య సమితి వేదికపై... చంద్రబాబు ప్రసంగం

  • ప్రకృతి బాట పడదాం 
  • ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం 
  • సాగు సమస్యలను పరిష్కరిద్దాం 
  • 2024కల్లా ఆంధ్రప్రదేశ్‌లో   ప్రతి ఎకరాలో ప్రకృతి సేద్యం 
  • ప్రపంచానికే ఆదర్శంగా  నిలుస్తాం 
  • మా ప్రయత్నానికి మద్దతివ్వండి 
  • ప్రపంచ దేశాలకు చంద్రబాబు పిలుపు 
  • ఐక్యరాజ్య సమితి సదస్సులో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం 
  • తెలుగులో ప్రారంభించి  ఆంగ్లంతో ఆకట్టుకున్న సీఎం 

 

‘ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ... తెలుగువారందరి తరఫున, భారతీయుల తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శం’ అంటూ ఐక్యరాజ్య సమితి వేదికపై తెలుగులో ఎలుగెత్తి చాటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికపై మొదట తెలుగులో ప్రసంగించిన ఆయన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసంగం కొనసాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో తాము అమలు చేస్తున్న పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానం (జెడ్‌బీఎన్‌ఎఫ్‌) త్వరలో ప్రపంచానికే ఒక నమూనాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆర్థికంగానూ, విజ్ఞానాన్ని అందించడంలోనూ, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లోనూ సహకరించాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఐక్యరాజ్య సమితి వేదికపై ఆంధ్రప్రదేశ్‌ గళం ఘనంగా వినిపించింది. ప్రకృతి సేద్యంపై తన ఘనతను ప్రపంచానికి చాటింది. మానవాళికి అత్యవసరమైన రసాయనిక రహిత ఆహార ఉత్పత్తులపై చేస్తున్న కృషిని కళ్లకు కట్టింది. ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తామని ప్రతినపూనింది. ఈ ప్రయత్నానికి సహకరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సోమవారం రాత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై కీలకోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యం ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ వేదికపై ఈ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ సాధించిన పురోగతిని, లక్ష్యాలను, ప్రయోజనాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

మాదే తొలి రాష్ట్రం 
ప్రకృతి సేద్యంపై అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. మా దేశంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తొలి రాష్ట్రం    ఆంధ్రప్రదేశే. రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.  ప్రకృతి సేద్యంలో మేం ఫలితాలు రాబట్టే దశలో ఉన్నాం. ఐటీ రంగంలో భారత్‌ బలమైన శక్తిగా ఉంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల సీఈవోలు భారతీయులే. ఒకప్పుడు ఐటీని ఎక్కువగా ప్రోత్సహించా. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని, ప్రకృతి పరిరక్షణతో కలిపి ప్రమోట్‌ చేస్తున్నా. ఇందులో భాగంగానే ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం.

అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారం.. 
వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడం, క్రిమిసంహారకాలు, రసాయనిక ఎరువులు మితిమీరి వాడటంవల్ల పర్యావరణం, వాతావరణం దెబ్బతినడం, కరవు కాటకాలు, అకాల వర్షాలు, వరదల వంటి వాటివల్ల జరుగుతున్న నష్టాలకు ప్రకృతి వ్యవసాయమే సరైన పరిష్కారం. పెట్టుబడిలేని ప్రకృతి సేద్యాన్ని పు±నరుజ్జీవిత వ్యవసాయ విధానంగా పిలుస్తాం. ఈ విధానంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. వ్యవసాయ ఖర్చులు, పంట నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. ఉత్పత్తి, ఆదాయం పెరుగుతుంది. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేకుండా చేయగలం. పైగా ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, దుష్ప్రభావాలు లేని, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించగలం. ప్రస్తుతం మనమంతా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలతో పండించిన ఆహారాన్నో, కల్తీ ఆహారాన్నో తినక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రకృతి సేద్యంతో వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మాతృమూర్తి మనకు జన్మనిస్తుంది. అన్నీ తానే అయి పెంచుతుంది. భూమాత మనకు నీరు, ఆహారం, స్వచ్ఛమైన గాలి... అన్నీ ఇస్తుంది. కానీ మనం ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతున్నాం. భూ మండలాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాం. భూ సారాన్ని క్షీణింపజేసి భూమాతను అనారోగ్యం పాలు చేస్తున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా మళ్లీ మనం స్వచ్ఛమైన ప్రకృతిలో జీవించగలం. భూ సారాన్ని పరిరక్షించుకోగలం. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రారంభించాక పట్టణాలకు వలసపోయిన వారంతా గ్రామాలకు తిరిగి రావడం (రివర్స్‌ మైగ్రేషన్‌) ప్రారంభమైంది. రైతు సంక్షేమం సాధ్యపడుతోంది. యువతను వ్యవసాయంవైపు ఆకర్షిస్తున్నాం. ఐటీ నిపుణులు ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేస్తున్నారు. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో గోమూత్రంతో శుద్ధి చేసి, ఆవుపేడ పూసిన విత్తనాల్ని వినియోగిస్తున్నారు. దీనివల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి సేద్యానికి ఖర్చు చాలా తక్కువ.

ఐదేళ్లలో నూరుశాతం.. 
2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని 80 లక్షల హెక్టార్లలో మొత్తం 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యానికి మళ్లేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల్ని ప్రకృతి సేద్యం చేపట్టేలా ఒప్పించేందుకు మూడేళ్లు పట్టింది. మంచి ఫలితాలు సాధించడం ద్వారా వారిలో విశ్వాసం కలిగించగలిగాం. ఈ పంటలు తినడంవల్ల ఆరోగ్యం మెరుగుపడిందని ఇప్పుడు వారే చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తొలి ఏడాది 15 శాతం, రెండో సంవత్సరం 50 శాతం, మూడో ఏడాది 80 శాతం, ఐదేళ్లలో నూరు శాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. 2016లో 40వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టగా, 2017కి ఈ సంఖ్య 63వేలకు పెరిగింది. 2018లో 5 లక్షల మంది రైతులు, 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2020 నాటికి 17 లక్షల మంది, 2022కి 41 లక్షల మంది, 2024 నాటికి 60 లక్షల మంది రైతుల్ని ప్రకృతి సేద్యంవైపు మళ్లించడం మా లక్ష్యం. సాధించగలమన్న నమ్మకం మాకుంది. రాష్ట్రంలోని 9 లక్షల మహిళా సాధికార బృందాలే మా బలం. వారంతా ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఉబరైజేషన్‌ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన పరికరాలను సమకూరుస్తున్నాం. గ్రామాల్లో పండగ వాతావరణం ఏర్పడుతోంది. చిట్టచివరి రైతుకీ విజ్ఞాన ఫలాలు అందజేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌కు రండి 
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 169 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగో వంతు లక్ష్యాలను ప్రకృతి సేద్యం ద్వారా సాధించవచ్చు. ప్రకృతి సేద్యం మరింత ప్రాచుర్యం పొందేందుకు భావ సారూప్యంగల పౌరులు, సంస్థలు సహకారం అందించాలని కోరుతున్నా. ఆహార శుద్ధి పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల గొలుసుకట్టు సంస్థలు తోడ్పాటునందించాలి. ప్రకృతి సేద్యంలో ప్రతి డాలరు పెట్టుబడికి 13 డాలర్ల లబ్ధి చేకూరుతుంది. దానికి అదనంగా పౌష్ఠికాహార, ఆరోగ్య భద్రత, ఉపాధి, భూసార, జల వనరుల పరిరక్షణ, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, జీవ వైవిధ్యం వంటి అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. మీరంతా ఆంధ్రప్రదేశ్‌కు రండి. మేం సాధిస్తున్న అభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును పరిశీలించండి. మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా గౌరవిస్తాం. మా ప్రకృతి వ్యవసాయ విధానం నచ్చితే అంతర్జాతీయ సమాజానికి వేగంగా అన్వయించేలా కృషి చేయండి. నేను గతంలో ఐటీ, ఆర్థిక సంస్కరణలపై చాలా ఉపన్యాసాలిచ్చా. కానీ ఇవాళ మీ సమక్షంలో ఐరాస వేదికపై చేసిన ప్రసంగం నాకెంతో సంతృప్తినిచ్చింది. ప్రకృతి వ్యవసాయానికి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు నాకు దక్కిన అద్భుత అవకాశంగా దీన్ని భావిస్తున్నా.

మీరు తిన్న పండు ఎక్కడిదో చెప్పొచ్చు... 
ఆధునిక టెక్నాలజీలో ఐవోటీ పరికరాల్ని ఉపయోగించుకుని ప్రతి వ్యవసాయ ఉత్పత్తికీ ట్రేసబిలిటీ, ట్రాకింగ్‌ విధానాల్ని అమల్లోకి తెస్తున్నాం. ఐటీ, ఐవోటీలో మేం చాలా బలంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్లు వెలుగుతుందీ లేనిదీ నేను న్యూయార్క్‌లో ఉండే రియల్‌టైం వ్యవస్థలో పర్యవేక్షించగలను. వ్యవసాయ ఉత్పత్తుల ట్రేసబిలిటీ, ట్రాకింగ్‌ వల్ల మీరు తినే పండు ఏ ప్రాంతంలో పండింది? అక్కడ నేల, వాతావరణ స్వభావం. పండించిన రైతు ఎవరు? క్రిమిసంహారకాలు, రసాయనిక ఎరువులు వాడారా? వంటి వివరాల్ని తెలుసుకోవచ్చు.


ప్రకృతి సేద్యానికి చుక్కాని 

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఒరవడి సృష్టిస్తోందని ప్రపంచ ప్రఖ్యాత ఐసీఆర్‌ఎఫ్‌కు చెందిన ప్రపంచ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్‌ డైరెక్టరు జనరల్‌ టోనీ సైమన్స్‌ ప్రశంసించారు. ఆయనతోపాటు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టరు జనరల్‌ రవి ప్రభు న్యూయార్క్‌లో చంద్రబాబుతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 30 దేశాల్లో వ్యవసాయ, అటవీ రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్న తమ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధనలు చేయడానికి, ప్రకృతి సేద్యంలో భాగస్వాములయ్యేందుకు వారు ఆసక్తి కనబరిచారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటైనా ఆశ్చర్యపడాల్సింది లేదని సైమన్స్‌ వ్యాఖ్యానించారు.

Posted On 26th September 2018

Source eenadu