నిబంధనలు సడలించనున్న ఐఐటీలు
నిబంధనలు సడలించనున్న ఐఐటీలు

దిల్లీ: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులు ఒత్తిడి వల్ల చదువు మధ్యలో ఆపేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఐఐటీలు నిబంధనలు సడలించే యోచనలో ఉన్నాయి. ఐఐటీయన్లకు అనువుగా ఉండేలా నిబంధనల సడలింపు కోసం విద్యార్థుల నుంచి ఆలోచనలు తీసుకోనున్నారు. ఇందుకు ఐఐటీల్లో అయిదు వారాల పాటు కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల నుంచి కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ ఈరోజు దేశంలోని ఐఐటీల డైరెక్టర్లు, ఛైర్‌పర్సన్‌లతో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఈ సమావేశంలో ఐఐటీల నిబంధనల సడలింపు గురించి నిర్ణయం తీసుకున్నారు.ఐఐటీలు వసతి గృహాలకు సంబంధించి కూడా నిబంధనలు సడలిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులు ఇంట్లో నుంచి కూడా తరగతులను వీడియో ద్వారా వీక్షించేలా అవకాశం కల్పించనున్నారు. దీని వల్ల వచ్చే మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యా సంస్థలకు నిధుల కోసం 'హైయర్‌ ఎడ్యుకేషన్‌ ఫండింగ్‌ ఏజెన్సీ' అంశంపై కేబినెట్‌ సమావేశంలో చర్చిస్తామని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ఏజెన్సీని ప్రకటించింది. రూ.వెయ్యి కోట్లతో ఏజెన్సీ ప్రారంభిస్తామని చెప్పింది.

Posted On 23rd August 2016

Source eenadu