డెన్మార్క్‌ ఓపెన్‌ మనదే... కిదాంబి శ్రీకాంత్‌ ఘన విజయం
డెన్మార్క్‌ ఓపెన్‌ మనదే... కిదాంబి శ్రీకాంత్‌ ఘన విజయం

తొలి రౌండ్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌పై విజయం. సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌పై గెలుపు.. ఇదీ ప్రత్యర్థి రికార్డు! కానీ మనోడి ముందు ఆ రికార్డులేవీ పనిచేయలేదు. ఆ దూకుడు చూసి ప్రత్యర్థికి దిమ్మతిరిగిపోయింది. అతని ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ముందు ప్రత్యర్థి దాసోహమన్నాడు. పదునైన స్మాష్‌లు, తిరుగులేని క్రాస్‌కోర్ట్‌ షాట్లు, నెట్‌ గేమ్‌, కచ్చితత్వంతో కూడిన ప్లేస్‌మెంట్లు.. ఇలా ఆల్‌రౌండ్‌ ఆటతో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ అదరగొట్టాడు. అత్యున్నత స్థాయి నైపుణ్యంతో ప్రత్యర్థిని బోల్తాకొట్టించి డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించిన శ్రీకాంత్‌.. ఇప్పుడు డెన్మార్క్‌ ఓపెన్‌తో ‘సూపర్‌’ హీరోగా అవతరించాడు.

భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 21-10, 21-5తో 37 ఏళ్ల లీ హ్యున్‌ (కొరియా)ను చిత్తు చిత్తుగా ఓడించాడు. ప్రకాశ్‌ పదుకొనె, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ టైటిల్‌ సాధించిన మూడో భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఒక్క ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెల్చుకున్న రెండో భారత ప్లేయర్‌ సైనా సరసన నిలిచాడు. బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఏడాదిలో 4 సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ఆడిన ఆరో ఆటగాడిగా కూడా 24 ఏళ్ల శ్రీకాంత్‌ ఘనత సాధించాడు.

తొలి రౌండ్‌ నుంచి సంచలనాలు నమోదు చేసిన లీ హ్యున్‌ అసలు పోరులో చేతులెత్తేశాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో శ్రీకాంత్‌ ముందు పూర్తిగా తేలిపోయాడు. కేవలం 25 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసిందంటే శ్రీకాంత్‌ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు శ్రీకాంత్‌ కంటే 13 ఏళ్లు పెద్దోడు కావడం.. వారం మొత్తం సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటంతో ఫైనల్లో హ్యున్‌ పాదాలు చురుగ్గా కదల్లేకపోయాయి. సెమీస్‌లో రెండో సీడ్‌ సాన్‌ వాన్‌ (కొరియా)తో గంటన్నరకు పైగా తలపడిన హ్యున్‌ పూర్తిగా కోలుకోలేదని ఆరంభంలోనే అర్థమైపోయింది. మ్యాచ్‌లో హ్యున్‌ సాధించిన ఆమాత్రం పాయింట్లు కూడా శ్రీకాంత్‌ అప్పుడప్పుడు చేసిన అనవసర తప్పిదాలే! 12 నిమిషాల్లో ముగిసిన మొదటి గేమ్‌లో తొలి రెండు పాయింట్లు ప్రత్యర్థివే. శ్రీకాంత్‌ వరుసగా నెట్‌కు ఆడటంతో ప్రత్యర్థి 2-0తో ఖాతా తెరిచాడు. 4-4 పాయింట్ల వద్ద హ్యున్‌ను అందుకున్న శ్రీకాంత్‌.. అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. శ్రీకాంత్‌ తెలివిగా ప్రత్యర్థిని కోర్టు నలువైపులా తిప్పాడు. హ్యున్‌ చురుగ్గా కదల్లేకపోతున్నాడని గ్రహించిన శ్రీకాంత్‌.. కచ్చితత్వంతో కూడిన ప్లేస్‌మెంట్లతో వరుసగా పాయింట్లు రాబట్లాడు. హ్యున్‌కు కుడి, ఎడమల స్మాష్‌లు బాదుతూ అతడిని కూడా ఓ ప్రేక్షకుడిగా మార్చేశాడు. 11-6తో ఆధిక్యం సంపాదించిన శ్రీకాంత్‌.. వరుస పాయింట్లతో హోరెత్తించాడు. చూస్తుండగానే 21-10తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

రెండో గేమ్‌ ఒక నిమిషం ఎక్కువే జరిగినా.. శ్రీకాంత్‌ దూకుడు రెట్టింపయింది. తొలి గేమ్‌ కోల్పోయినా.. రెండు, మూడు గేమ్‌ల్లో సత్తాచాటి ఫైనల్‌ వరకు వచ్చిన హ్యున్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శ్రీకాంత్‌ వ్యూహాత్మకంగా ఆడాడు. తొలి షాట్‌ నుంచే దూకుడును టాప్‌ గేర్‌లోకి తీసుకెళ్లాడు. అంతే.. పాయింట్లు వరుస కట్టాయి. శ్రీకాంత్‌ స్మాష్‌లతో చెలరేగుతుంటే హ్యున్‌ అలా చూస్తుండి పోయాడు. వరుసగా 10 పాయింట్లు రాబట్టిన శ్రీకాంత్‌ 11-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. రెండో గేమ్‌లో ఏ దశలోనూ హ్యున్‌ పోటీనివ్వలేపోయాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌ దూకుడు.. ప్రత్యర్థి ఆట చూస్తే మనవాడు ప్రాక్టీస్‌ చేస్తున్నట్లే అనిపించింది. శ్రీకాంత్‌ షాట్లకు ప్రత్యర్థి దగ్గర సమాధానమే లేదు. కొన్నిసార్లు హ్యున్‌ షటిల్‌ను అందుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి 21-5తో రెండో గేమ్‌, మ్యాచ్‌ శ్రీకాంత్‌ సొంతమయ్యాయి. శ్రీకాంత్‌ ఖాతాలో మరో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ చేరింది.

‘‘శ్రీకాంత్‌.. నీకు అభినందనలు. డెన్మార్క్‌ ఓపెన్‌లో నీ చిరస్మరణీయ విజయంతో ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. సంతోషపడుతున్నాడు’’

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Posted On 23rd October 2017

Source eenadu