ఫైనల్‌ చేరిన పీవీ సింధు
ఫైనల్‌ చేరిన పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సెమీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫీపై వరుస సెట్లలో 21-13, 21-10 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరడం సింధుకు ఇదే తొలిసారి. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సింధు.. టైటిల్‌ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్‌లో ఒకుహరాతో ఆమె తలపడనుంది.

ప్రపంచ నం.4 సింధు సెమీస్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి ప్రత్యర్థిని చిత్తుచేసింది. తనదైన షాట్లతో చెలరేగి 48 నిమిషాల్లోనే ఆటను ముగించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గతంలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న సింధు.. మొదటిసారిగా తుదిపోరులోకి అడుగుపెట్టింది. తన స్వర్ణం కలను నెరవేర్చుకోవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది.

తొలి సెమీస్‌లో మరో తెలుగు తేజం సైనా నెహ్వాల్‌ను ఓడించిన జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాతో.. రియో రజత పతక విజేత సింధు ఫైనల్‌లో తలపడనుంది. సింధు ఇదే జోరును ఫైనల్‌లో కొనసాగించి భారత్‌కు స్వర్ణం అందించాలని ఇప్పుడు ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.

సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌ కాంస్యంతో సరిపెట్టుకోగా.. ఇప్పుడు సింధు ఖాతాలో మరో పతకం చేరనుంది. 40 ఏళ్ల భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటి వరకూ గెలిచిన పతకాలు ఐదే. ఇప్పుడు ఒకేసారి రెండు పతకాలతో భారత్‌ స్వదేశానికి తిరిగిరానుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే ఇదో సువర్ణాధ్యాయమని అభిమానులు పేర్కొంటున్నారు.

Posted On 27th August 2017

Source eenadu