చిట్టితల్లీ.. నిన్ను చదివిస్తా - గౌతమ్‌ గంభీర్‌
చిట్టితల్లీ.. నిన్ను చదివిస్తా - గౌతమ్‌ గంభీర్‌

  • రోదిస్తున్న జోహ్రా ఫొటో చూసి చలించిపోయిన గౌతమ్‌ గంభీర్‌
  • అమరుడైన పోలీసు కుమార్తెకి అండగా ముందుకొచ్చిన క్రికెటర్‌

ఉగ్రవాదుల చేతుల్లో తండ్రి మరణం.. ఆ విషయం తెలీగానే ఆ చిట్టితల్లి గుండె పగిలేలా.. గుక్కపట్టి రోధించింది. ఆమె కళ్ల నుంచి కారుతున్న కన్నీళ్లు ‘నాకు దిక్కెవరు నాన్నా..’ అన్న ఆవేదనే కనిపించింది. ఆ చిత్రం క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను చలింపజేసింది. వెంటనే.. ‘నేనున్నా’నంటూ ముందుకొచ్చాడు. జీవితాంతం ఆమె చదువుకయ్యే ఖర్చును భరిస్తానని మాటిచ్చాడు. కశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో ఆగస్టు 28న ఉగ్రవాదుల దాడిలో ఏఎస్‌ఐ అబ్దుల్‌ రషీద్‌ మరణించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక రషీద్‌ కుమార్తె జోహ్రా ఆయన శవపేటిక వద్ద గుండెలు పగిలేలా విలపించింది.

ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిని చూసి చలించిన గౌతీ.. ‘జోహ్రా నువ్వలా కన్నీళ్లు కార్చకు. భూదేవి కూడా నీ గుండె బాధ భారాన్ని మోయలేదేమో. అమరుడైన మీ నాన్నకు సెల్యూట్‌. నేనిప్పుడు జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చలేను. కానీ, నీ కలల సాకారానికి సాయం చేస్తా.’ అని మంగళవారం ట్వీట్‌ చేశాడు. గంభీర్‌ చూపిన ఔదార్యానికి జోహ్రా కృతజ్ఞతలు తెలిపింది. తాను డాక్టర్‌ కావాలని అనుకుంటున్నట్టు తెలిపింది. దీనికి గౌతీ వెంటనే స్పందిస్తూ..‘జోహ్రా బేటా నాకు థ్యాంక్స్‌ చెప్పకు. నా కుమార్తెలు అజీన్‌, అనైనాలాగే నువ్వూ. డాక్టర్‌ కావాలనుకుంటున్నావుగా. నీ కలల వెంట పరిగెత్తు. మేమంతా నీ వెంట ఉన్నామ’ని ట్వీట్‌ చేశాడు. గతంలోనూ సుక్లా దాడిలో గాయపడ్డ సీఆర్‌పీఎఫ్‌ బాధితులకు గౌతీ ఐపీఎల్‌లో తనకు అందే మొత్తం ప్రైజ్‌మనీని విరాళంగా ఇచ్చాడు.

Posted On 6th September 2017

Source andhrajyothi