జహీర్ కన్నా మించి ఈయనలో ఏముంది ?
జహీర్ కన్నా మించి ఈయనలో ఏముంది ?

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భాద్యతలు చేపట్టారు. అయితే శాస్త్రి అంటే సగటు అభిమాని కూడా ఈజీగా గుర్తుపట్టగలడు. కానీ భరత్అరుణ్ అనగానే ఇతనెవరా? అసలు క్రికెట్ ఆటగాడేనా? అనే సందేహం సగటు అభిమానిలో వస్తుంది. జహీర్‌ఖాన్ కు మినహాయింపు ఇచ్చి మరీ ఇతన్ని బౌలింగ్ కోచ్‌గా ఎలా తీసుకున్నారు. అని ప్రస్తుతం సగటు క్రికెట్ అభిమానుల సందేహం.

వాస్తవానికి ఇలా సందేహం రావడం కరెక్ట్. ఎందుకంటే భరత్అరుణ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది కేవలం ఆరు మాత్రమే. అందులో వన్డేలు నాలుగు, టెస్టులు రెండు. ఇక ఆయన తీసిన వికెట్ల సంఖ్య ఐదు. 1986 లో సొంతగడ్డ పై శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో అంతర్జాతీయ మ్యాచుల్లో అడుగుపెట్టిన భరత్ సరిగ్గా ఏడాది కూడా జట్టులో కొనసాగలేదు. కానీ కోచ్‌గా మాత్రం 15 ఏళ్ళ అనుభవం ఇతనికి ఉంది. అదే అనుభవం ఇప్పుడు ఇతనికి ఇండియా బౌలింగ్ కోచ్ పదవి తెచ్చిపెట్టింది.అండర్-19 జట్టుకు కోచ్‌గా చేసి వారికి ఎనిమిది సిరీస్ లతో పాటు 2012 ప్రపంచకప్ కూడా తేవడంలో కీలకపాత్ర వహించాడు. భరత్ వ్యక్తిగతంగా రవిశాస్త్రికి అత్యంత సన్నిహితుడు. పైగా జట్టులోని ఆటగాళ్లతో క్లోజ్ గా ఉంటూ..వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో భరత్అరుణ్ దిట్ట. బహుశా ఇవన్నీ కూడా బిసిసిఐ పరిగణలోకి తీసుకొనే.. జహీర్ ను పక్కకుపెట్టి మరీ భరత్అరుణ్ ను కోచ్ గా అప్పాయింట్ చేసింది కావచ్చు. చూడాలి మరి ఈయన భారత బౌలర్లకు ఎలాంటి శిక్షణ ఇస్తాడో.. ఎలాంటి ఫలితాలు తెస్తాడో..!

Posted On 19th July 2017

Source andhrajyothi