గొడవకని వచ్చి.. హర్మన్‌తో ఆటోగ్రాఫ్‌
గొడవకని వచ్చి.. హర్మన్‌తో ఆటోగ్రాఫ్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను ఆమె కోచ్‌ కమల్‌దీష్‌ పాల్‌ సింగ్‌ సోథీ తన ఇంట్లో టీవీ ద్వారా వీక్షించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌పై హర్మన్‌ 115 బంతుల్లో 171(20 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇన్నింగ్స్‌ చూసిన సోథీ ఏ మాత్రం ఆశ్చర్యానికి గురి కాలేదట. నిజమండీ! ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారు.

మోగాలో కోచ్‌ సోధీ మాట్లాడుతూ.. ‘సెమీఫైనల్లో ఆసీస్‌పై హర్మన్‌ ఇన్నింగ్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రాక్టీస్‌ సమయంలో ఆమె కఠోర సాధన చేసేది. బంతిని వేలాడేసి బ్యాట్‌తో దాన్ని సరైన చోట కొట్టేది. గంటల తరబడి ఇలాగే ప్రాక్టీస్‌ చేసేది. జ్ఞాన్‌ జ్యోతి పాఠశాలలో ఈ సాధన చేసేది. అంతటితో ఆపేది కాదు. వేలాడేసిన బంతిని సుమారు 2వేల సార్లు సరైన సమయంలో బాదేది. ఇదే ఆమె విజయ రహస్యం’ అని సోధీ తెలిపారు.

అనంతరం ఓ మ్యాచ్‌లో చోటు చేసుకున్న సన్నివేశం గురించి ఆయన వివరించారు. ‘14 ఏళ్ల వయసులోనే ఆమె క్రికెట్‌ను ఎంతో సీరియస్‌గా ఆడేది. దీంతో ఆమె జిల్లా సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకుంది. ఓ సారి పటియాలాలో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ నాలుగు సిక్స్‌లు బాదింది. రెండు సిక్స్‌లకు మైదానం సమీపంలో ఉన్న ఓ ఇంటి కిటీకి అద్దాలు పగిలిపోయాయి. గమనించిన ఆ ఇంటి యజమాని గొడవ పెట్టుకునేందుకు మైదానానికి వచ్చాడు. కానీ హర్మన్‌ ఇన్నింగ్స్‌ చూసి ఆశ్చర్యపోయిన అతడు... ఆమె ఆటోగ్రాఫ్‌ తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సన్నివేశం ఎప్పటికీ మరిచిపోలేను’ అని ఆయన తెలిపారు. ప్రతి మ్యాచ్‌కి ముందు హర్మన్‌ నాకు ఫోన్‌ చేసింది. సెమీఫైనల్లో ఆసీస్‌తో తలపడే రోజు కూడా నాతో మాట్లాడింది. అప్పుడు నేను ఒకటే చెప్పా. ‘మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించకు. మైదానంలో కాస్త నిలదొక్కుకున్న తర్వాత హిట్టింగ్‌ మొదలుపెట్టు’ అని చెప్పాను. గతంలోనూ ఆమెకి ఇదే చెప్పే వాడినని కమల్‌దీష్‌ చెప్పారు.

Posted On 23rd July 2017

Source eenadu