కొరియా సూపర్‌ సిరీస్‌ మనదే... ఫైనల్లో సింధు ఘన విజయం
కొరియా సూపర్‌ సిరీస్‌ మనదే... ఫైనల్లో సింధు ఘన విజయం

ఆనాటి ఓటమికి ఆమె బదులిచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన ప్రత్యర్థిపై నేడు ప్రతీకారం తీర్చుకుంది. కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు జయకేతనం ఎగురవేసింది. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18తో సింధు విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహర చేతిలో సింధు ఓటమి చవిచూసి రజతంతో సరిపెట్టుకుంది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అద్భుతంగా పోరాడిన సింధుకు తృటిలో స్వర్ణం చేజారిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో సింధును ఓడించి ఒకుహర ఛాంపియన్‌ అయ్యింది. అయితే శనివారం జరిగిన కొరియా ఓపెన్‌ సెమీఫైనల్లో సింధు గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌-2 యమగూచిని ఓడించి జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహర ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి వీరిద్దరికి టైటిల్‌ పోరు పడింది. ఆదివారం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్‌లో సింధు విజయం సాధించింది.

ఆరంభం నుంచే ఒకుహర దూకుడు ప్రదర్శించగా.. సింధు కూడా దీటుగా బదులిచ్చి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. అయితే తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సింధు.. రెండో గేమ్‌లో  కాస్త తడబడింది. ఒకుహర విజృంభించడంతో సింధు తేలిపోయింది. దీంతో 11-21తో రెండో గేమ్‌ను కోల్పోయింది. ఇక డిసైడ్‌ చేసే మూడో గేమ్‌లో  సింధు మళ్లీ పుంజుకుని 21-18తో టైటిల్‌ను దక్కించుకుంది.

Posted On 17th September 2017

Source eenadu