హలీం తయారీ
హలీం తయారీ

కావల్సినవి: 

ఎముకల్లేని మటన్‌ - 200 గ్రా, గోధుమరవ్వ - పావు కప్పు, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి - మూడు, షాజీరా - చెంచా, మిరియాలు - అరచెంచా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు, గరంమసాలా - అరచెంచా, పుదీనా - కట్ట, నెయ్యి - పావుకప్పు, నూనె - టేబుల్‌స్పూను, నీళ్లు - రెండు కప్పులు, ధనియాలపొడి - చెంచా, నిమ్మరసం - టేబుల్‌స్పూను.

తయారీ: 

మటన్‌ని శుభ్రంగా కడగాలి. గోధుమరవ్వను అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మటన్‌, షాజీరా, మిరియాలూ, గరంమసాలా, పచ్చిమిర్చీ, అల్లంవెల్లుల్లి ముద్దా, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ, నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదు కూతలు వచ్చాక పొయ్యి కట్టేయాలి. తరవాత మటన్‌ని మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి గోధుమరవ్వ వేసి కప్పు నీళ్లు పోయాలి. రవ్వ పూర్తిగా ఉడికిందనుకున్నాక దింపేయాలి. మరో బాణలిని పొయ్యిమీద పెట్టి.. నెయ్యి వేయాలి. అది కరిగాక ఉడికించి పెట్టుకున్న గోధుమరవ్వా, మటన్‌ వేయాలి. కాసేపటికి ఇది ముద్దలా అవుతుంది. అప్పుడు ఉల్లిపాయ ముక్కలూ, నిమ్మరసం, పుదీనా వేసి దింపేయాలి.

Posted On 13th June 2017

Source eenadu