మరొకరికి ప్రాణం... రాష్ట్రంలో పెరుగుతున్న అవయవదానం
మరొకరికి ప్రాణం... రాష్ట్రంలో పెరుగుతున్న అవయవదానం

భౌతికంగా తమవారు జీవించి లేకున్నా వేరొకరిలో వారిని చూసుకునేందుకు బాధితులు చూపుతున్న ఔదార్యం పలువురికి ప్రాణదానం చేస్తోంది. బ్రెయిన్‌డెడ్‌ అయినవారి అవయవాలను ఇచ్చేందుకు బంధువులు ముందుకు వస్తుండటం స్ఫూర్తి నింపుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘జీవన్‌దాన్‌’ ద్వారా మార్చి 2015 నుంచి ఇప్పటివరకూ బ్రెయిన్‌డెడ్‌గా గుర్తించిన 88 మంది నుంచి 447 అవయవాలను తీసుకుని ఇతరులకు అమర్చారు. అవయవాల మార్పిడికి ఎంపిక చేసిన ప్రధాన ఆస్పత్రుల్లో.. కర్నూలు, గుంటూరు, తిరుపతి స్విమ్స్‌, కేజీహెచ్‌ వైజాగ్‌, ఇతర ప్రైవేటు ఆస్పత్రులు 37 వరకూ ఉన్నాయి.

కిడ్నీల కోసం నిరీక్షణ! 
అవయవాల కోసం 375 మంది రోగులు ఎదురుచూస్తున్నారు. వీరిలో కిడ్నీల కోసం ఎదురుచూసే వారి సంఖ్య 328 వరకూ ఉంది. లివర్‌ కోసం 41 మంది, గుండె మార్పిడి కోసం ఆరుగురు పేర్లను నమోదు చేయించుకున్నారు. పేర్ల నమోదు, ఇతర పూర్తి వివరాలను జీవన్‌దాన్‌ టోల్‌ఫ్రీ నెంబరు 1800 4256 4444 ద్వారా తెలుసుకోవచ్చు.

ఎంపిక ఇలా! 
ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో రోగి బ్లడ్‌ గ్రూపు, వయస్సు, ఇతర వివరాలు ఉంటాయి. నిరీక్షణ జాబితాలో ఉన్న వారి అవసరాలను అనుసరించి ప్రథమ, ద్వితీయ, తృతీయ, తరువాత వరుస క్రమంలో శ్రేణులను కేటాయిస్తున్నారు. దాత వివరాలు వచ్చినప్పుడు అవి ఏ రోగులకు సరిపోతాయో సాఫ్ట్‌వేర్‌ వెంటనే చెప్పేస్తుంది. ఇందులో తొలుత ఎవరు పేర్లను నమోదు చేసుకున్నారో వారికి ప్రాధాన్యం ఉంటోంది.

స్ఫూర్తి

* కృష్ణా జిల్లా మాచవరానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు రూప్‌ కుమార్‌ బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా కిడ్నీ, కాలేయం, కళ్లను తొలగించి... రోగులకు అమర్చారు. 
* కృష్ణా జిల్లాకు చెందిన ఆలపాటి కోటేశ్వరరావు (68) విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇంటి తోట పనిచేస్తూ కిందపడినప్పుడు రాయి తగలడంతో తలకు తీవ్ర గాయమైంది. బ్రెయిన్‌డెడ్‌గా నిర్థారించిన అనంతరం ఈయన కిడ్నీ, లివర్‌ను మరొకరికి అమర్చారు. 
* గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన విష్ణుప్రియ (23) చున్నీ ద్విచక్ర వాహనం చక్రంలో పడి కిందపడింది. తలకు బలమైన గాయం కావడంతో మెదడు దెబ్బతింది. ఆమె రెండు కిడ్నీలు, కాలేయం, కళ్లను తొలగించి ఐదుగురికి అమర్చారు.

మా అబ్బాయి ఉన్నాడు కదా..

మా అబ్బాయి పాఠశాలలో ఆడుకుంటూ బెంచిని కొట్టుకోవడంతో చిన్న మెదడు దెబ్బతింది. మెదడు పనిచేయడం లేదని అవయవ దానాల గురించి చెప్పారు. అంగీకరించాం. మా అబ్బాయి నలుగురిలో ఉన్నాడన్న తృప్తితో ఉన్నాం.

-రూప్‌కుమార్‌ తల్లిదండ్రులు రామకృష్ణ, సునీత

ఇది పునర్జన్మే

నేను 2014 జులై నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. భర్త కిడ్నీ ఇస్తానన్నారు. ఇంట్లో ఇద్దరం పేషంట్లుగా ఉండటం నాకిష్టంలేదు. డయాలసిస్‌ ద్వారా భారంగా జీవనాన్ని సాగిస్తుండగా జీవన్‌దాన్‌ ద్వారా దాత ఇచ్చిన కిడ్నీతో నా ఆరోగ్యం మెరుగుపడింది.

-కె.కరుణాదేవి, అమరావతి, ఉద్యోగిని

వైద్యుల్లోనూ మార్పు రావాలి

బ్రెయిన్‌డెడ్‌ అయినవారి అవయవ దానంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కనిపిస్తోంది. ఈ విషయంలో వైద్యుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అవయవాలను దానం చేసిన వ్యక్తుల గురించి స్వీకర్తలకు తెలియచేయం.

-డాక్టర్‌ రవిరాజ్‌, ఛైర్మన్‌, జీవన్‌దాన్‌, ఉపకులపతి ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

Posted On 6th July 2017

Source eenadu