తెలుగు రాష్ర్టాల్లో ఘ‌నంగా యోగా దినోత్స‌వం
తెలుగు రాష్ర్టాల్లో ఘ‌నంగా యోగా దినోత్స‌వం

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంద‌డి నెల‌కొంది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ యోగాస‌నాలు వేశారు. స్వ‌చ్చంద, ఆధ్మాత్మిక‌ సంస్థ‌లు ఆధ్వ‌ర్యంలో ప‌లుచోట్ల యోగా శిక్ష‌ణ శిబిరాలు ఏర్పాటుచేశారు. యోగా విశిష్ట‌త‌లు, దాని ప్రాముఖ్య‌త గురించి ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న కల్పించారు.

 

రాజ్‌భ‌వ‌న్‌లో.. 
 యోగా.... పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సంపద అని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్  నరసింహన్ అన్నారు. హైదరాబాద్ రాజ్భవన్ లో  జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొని  యోగాసనాలు వేశారు. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదని... సంపూర్ణ ఆరోగ్యమే ఓ వరమని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని... ఒత్తిళ్లను దూరం చేసుకోవచ్చని తెలిపారు. గంటల తరబడి ఆసనాలు వేయాల్సిన అవసరం లేదని... ప్రాణాయామం, శవాసనం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 
రోజుకో గంటైనా యోగా సాధన చేస్తే దేనినైనా జయించే శక్తి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ధృఢ సంకల్పం సాధన కోసం సరైన ప్రణాళిక తయారుచేసుకునేందుకు యోగా దోహదపడుతుందని ఆయన తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  18ఏళ్ల యువతతో పోటీపడుతూ  ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యోగాసనాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ కార్య‌క్ర‌మంలో నెల్లూరుకు చెందిన జ్యోత్స్న అనే విద్యార్థిని ప్రదర్శించిన అద్భుత యోగాసనాలు అందరినీ మైమరిపింపచేశాయి. జ్యోత్స్న ప్రదర్శనకు ముగ్ధులైన ముఖ్యమంత్రి  ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు 5లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తూ నజరానా ప్రకటించారు. ప్రపంచ యోగాసభలకు హాజరయ్యేందుకు జ్యోత్స్నకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారు.

 

విజయవాడ  సిద్దార్ధ కళాశాల అడిటోరియంలో విద్యార్ధులు యోగాసనాలు వేశారు. పిబి సిద్దార్ధ అడిటోరియం, మహిళ కళాశాల అడిటోరియంలో  సిద్దార్ధ అకాడమీకి  చెందిన వెయ్యి మంది విద్యార్ధులు, 200 మంది అధ్యాపకులు యోగా విన్యాసాలు చేయించారు. యోగా, ధ్యానం చేయటం  ద్వారా ఒత్తిడికి దూరం కావొచ్చ‌ని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించుకోవచ్చుని యోగా నిపుణులు తెలియజేశారు.

 గుంటూరు ఎన్టీఆర్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  మహిళలు, పిల్లలు సహా వందలాది మంది యోగా సాధకులు తరలివచ్చి... యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు. వర్షంతో మైదానంలో ఏర్పాట్లు చెల్లాచెదురైనప్పటికీ... బాస్కెట్ బాల్ మైదానాన్నే..... యోగా ప్రదర్శనకు వేదికగా మార్చుకుని తమ చిత్తశుద్ధిని ఘనంగా చాటి చెప్పారు. మనసు,శరీరాన్ని మిళితం చేసి చక్కని ఆరోగ్యం, తేజస్సును ఇచ్చే యోగాను నిత్యజీవితంలో భాగంగా మార్చుకోవడం అనివార్యమని... యోగా సాధకులు తమ ప్రదర్శనలు, విన్యాసాల ద్వారా అందరికీ తెలిజేశారు. 
రాజమహేంద్రవరంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లాలాచెరువులోని నగరవనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. యోగా గురు రామకృష్ణ.. అధికారులు, నగర పౌరులతో యోగా చేయించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలోనూ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నౌకాదళ సిబ్బంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గోన్నారు. నేవల్ డాక్ యార్డులో పెద్ద సంఖ్యలో సిబ్బంది యోగా ప్రదర్శన చేశారు. మరో వైపు బంగాళాఖాతంలో ప్రయాణంలో ఉన్న ఐఎన్ఎస్ జలాశ్వపైనా నౌకాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు. అంతర్జాతీయంగా యోగాకు ఉన్న ప్రాముఖ్యం ఈ యోగా దినోత్సవం సందర్భంగా మరోమారు స్పష్టం చేసిందని నౌకాదళ అధికార్లు చెప్పారు. నౌకాదళానికి చెందిన అన్ని నౌకలు, జలాంతర్గామిలలోనూ కూడా యోగాసనాలు వేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. కోడి రామ్మూర్తి క్రీడా మైదానం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, కలెక్టర్‌ ధనంజయరెడ్డి, జేసీ చక్రధర్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా యోగా ఆసనాలు వేశారు.

 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. నగరంలోని పోలీస్ ప‌రేడ్ మైదానంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు, యోగా నిపుణులు అందరితో ఆసనాలు వేయించారు. సైనికులు, పాఠశాల విద్యార్థులు, గృహిణిలు ఎంతో ఉత్సాహంగా యోగా చేశారు. ఉదయం 7గంటల నుంచి ఎనిమిదిన్నర గంట‌ల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

 పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆయూష్‌శాఖ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. వంగాయిగూడెం సౌభాగ్య కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భాస్కర్‌ కాటమనేని,  ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ సూర్యారావు తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  యోగా చేయడం వల్ల మనస్సు, జ్ఞాపకశక్తి అన్ని నియంత్రణలో ఉంటాయని  కలెక్టర్‌ భాస్కర్‌  కాటమనేని అన్నారు. 
తెలంగాణ‌లో 
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. పిఎస్ఆర్ గార్డెన్స్ లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్ధులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ వాసులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

 వరంగల్‌ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ జెన్‌ఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో  వరంగల్‌ అర్బన్‌ అయూష్‌ డిపార్ట్‌మెంటు ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు వరంగల్‌ మేయర్‌ నరేందర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ , విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల యోగాసనలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో అంబేడ్కర్‌ స్టేడియంలో వివేకానంద యోగా ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మెట్‌పల్లి డిఎస్పీమల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులు పలు యోగాసానాలను వేసి అందరిని ఆకట్టుకున్నారు.

 అంతర్జాతీయ యోగ దినోత్సవం ఖమ్మంలో ఘనంగా జరిపారు. పలు శిక్షణా సంస్థల ఆధ్వర్యంలో యోగాసానాలు వేశారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఆండ్‌ బీజీఎన్‌ఆర్‌ డీగ్రీ కళాశాల మైదానంలో సేవా భారతి ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలు యోగాసానాలు వేశారు. టీఎన్జీవో ఫంక్షన్‌ హల్లో ప్రకృతి యోగా సంస్థ ఆధ్వర్యంలో అభ్యాసకులు యోగసానాలు వేశారు.  ఆర్టీవో కార్యాలయ ఆవరణలో భారత స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పతాంజలి యోగ పరిరక్షణ సమితి సభ్యులు యోగాసానాలు వేశారు.  నగర పోలీస్‌ కమీషనర్‌  తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పేరేడ్‌ మైదానంలో  ఐదు వందల మంది పోలీసులు యోగాసానాలు వేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని... నల్గొండ జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో... విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్య‌త‌ను వివరిస్తూ... ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను శిక్షకులు వివరించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. భానుపురి ఉన్నత యోగా మండలి , ఆర్ట్‌ ఆఫ్‌ లింవింగ్‌  కార్యకర్తలు , మధు గురూజీ యోగా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి వందలాది మంది యోగా సాధకులు హాజ‌రై ఆసనాలు ప్రదర్శించారు.  యోగా వేడుకలకు రాష్ట్ర  మంత్రి జగదీశ్‌రెడ్డి , కలెక్టర్‌ సురేంద్ర మోహ‌న్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Posted On 21st June 2017

Source eenadu