‘బాహుబలి 2’ రికార్డుల మోత

విడుదలకు ముందే ‘బాహుబలి 2’ రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదలైన ట్రైలర్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. తెలుగులో విడుదలైన ట్రైలర్‌ కేవలం 12 గంటల్లో 1.50కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ రికార్డు వ్యూస్‌ చెబుతున్నాయి. 
ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌ ఉంచడమే ఆలస్యం ఆ సంఖ్య లక్షల్లోకి వెళ్లిపోయింది. సాయంత్రం 4 గంటల సమయానికి ఈ ట్రైలర్‌ను కోటిమంది వీక్షించడం విశేషం. 2015 జూన్‌ 1న ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఇప్పటివరకూ 78.41లక్షల వ్యూస్‌ వచ్చాయి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌ మాత్రం విడుదల రోజే ఈ రికార్డు సాధించడం విశేషం. సినిమా విడుదలయ్యేలోపు (ఏప్రిల్‌ 28) ఈ ట్రైలర్‌ మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

Posted On 17th March 2017

Source eenadu