పాత్రల రంగు బట్టి ఆకలి
పాత్రల రంగు బట్టి ఆకలి

బరువు తగ్గడమే మీ లక్ష్యమా? మనసు చంపుకొని.. నోరు కట్టుకుని.. కఠోర కసరత్తులు చేస్తున్నారా? బాధపడకండి. ‘తినే ప్లేటును మార్చి చూడండి. మీ కడుపు ఇట్టే నిండిపోతుంది’ అంటున్నారు ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ మనస్తత్వ నిపుణుడు డా.చార్లెస్‌ స్పెన్స్‌. ఏ రంగు పాత్రలో తింటే ఎంత తృప్తి కలుగుతుంది, ఆకలిలో ఎలాంటి మార్పులు వస్తాయన్న విషయాలపై భలే అధ్యయనం సాగించారులెండి ఈ మధ్య! మనం సాధారణంగా తెల్లటి ప్లేటులో భోజనం వడ్డించుకుంటాం. దీంట్లో ఆహార పదార్థాలు స్పష్టంగా, ఆకర్షణీయంగా కనబడతాయి. మెదడు ఇచ్చే సంకేతాల వల్ల మనకు తెలియకుండానే అప్పటికప్పుడు ఆకలి పెరిగి, ఆబగా తినేయాలనిపిస్తుంది. స్వీట్లు, ఐస్‌క్రీం గట్రా అయితే మరింత నోరూరిపోతుంది. పరిశోధకులు వీటి లెక్కలను కూడా వేశారండోయ్‌. నల్లటి పాత్రతో పోలిస్తే, తెల్లటి పాత్రలో తినడం వల్ల... తీపి 7%, రుచి 13%, తృప్తి 9% ఎక్కువగా ఉంటాయట. ఇలాగైతే నోరూరించే తెల్లటి పళ్లాలతో అధిక బరువు ఉన్నవాళ్లకు ఇబ్బందే మరి! అందుకే వాళ్లను ఎర్రటి పాత్రల్లో భోజనం చేయమని సలహా ఇస్తున్నారు చార్లెస్‌. ఎరుపు రంగు వల్ల ప్రమాద సంకేతాలు మెదడుకు అందుతాయనీ, తినాలన్న కోరిక తగ్గిపోయి, తక్కువ ఆహారంతోనే కడుపు నిండిపోతుందని విశ్లేషించారాయన. ‘‘తెల్లటి ప్యాకింగ్‌ వల్ల ఆహార పదార్థాలు 7% అధిక తీపి అనుభవాన్ని అందిస్తాయి గనుక... తయారీ సంస్థలు ఆహారంలో తీపిని తగ్గిస్తే ఆరోగ్యపరంగా వినియోగదారులకు మేలు చేసినవారు అవుతారు’’ అని ఆయన సలహా ఇస్తున్నారు.

Posted On 30th April 2017

Source eenadu