పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలిపి తింటే. . .
పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలిపి  తింటే. . .

శరీరంలో జరిగే జీవ రసాయన క్రియలకు నీటి అవసరం ఏర్పడినపుడు గొంతెండి పోవడం, నీరు తాగాలనిపించడం లాంటి లక్షణాల ద్వారా మనసు అవసరాన్ని తెలియజేస్తుంది. దీనినే దాహం అంటున్నాం. ఈ రకమైన దాహం తీరడానికి వెంటనే ఒక టీ లేక రెండు గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది. అందరికీ ఈ రకమైన దాహం నిత్యం ఏదో సమయంలో కలుగుతుంది. ఇది సహజమే! కానీ ఈ దాహం అధికమై రోజు మొత్తంలో తరచుగా బాధిస్తుంటే ఆ దాహాన్ని ఆయుర్వేద పండితులు వ్యాధిగా గుర్తించారు. దీన్నే ‘‘తృష్ణ’’ అని అన్నారు. వాత పైత్య దోషాలు ప్రకోపించి సమతుల్యతను కోల్పోవడం వల్ల అధిక దాహం పుడుతుందనేది ఆయుర్వేద సిద్ధాంతం. బయటి వాతావరణంలోని తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని నీటి శాతం బాగా తగ్గిపోయి, శరీర పోషణకు ఉపయోగపడే రసధాతువులు పోషించే స్థితిలో అధిక దాహం ఏర్పడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎంతో మంది ఈ అధిక దాహానికి గురి కావడం సహజంగా చూస్తుంటాం. వేసవిలో తీవ్రమైన ఎండలకు శరీరంలోని జీవ లవణాలు చెమట రపంలో ఎక్కువ శాతం ఆవిరైపోయి రక్తపోటు తగ్గిపోయి ఏర్పడిన దాహం ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది. మనుషులే కాకుండా ఇతర జీవరాసులన్నీ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రాణాధారమైన నీటికోసం పరుగులు తీస్తాయి.

 నోరు చేదుగా ఉండి నోరెండిపోవడం, తలనొప్పి, తల తిరగడం, కళ్లు మసక బారడం, చల్లని నీరు పదే పదే తాగాలనిపించడం మొదలైన ప్రధాన లక్షణాలు దాహంతో బాధపడే వారిలో కనిపిస్తాయి. దాహ చికిత్సలో భాగంగా వాత, పిత్త దోషాల ప్రకోపాన్ని తగ్గించి, ఆకలి కలిగించే చికిత్సలు చేయాలి.

ఈ చిట్కాలు పాటించండి..
 ఒక టీస్పూన్‌ మంచి గంధాన్ని, రెండు టీస్పూన్ల ఉసిరి రసాన్నీ, రెండు టీస్పూన్ల తేనె కలిపి తాగిస్తే దాహంతో పాటు వాంతులు కూడా తగ్గుతాయి.

 గ్లాసు చల్లని నీటిలో నాలుగు చెంచాల పంచదార, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే దాహం తగ్గుతుంది.

 మేడి పండ్ల రసంలో చక్కెర కలిపి తాగితే అతిదాహం తగ్గుతుంది

 సుగంధి పాల కషాయంలో సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండిన దానికి సగం నీరు కలిపి తాగితే వేసవి తాపం, దాహం తగ్గిపోతాయి. 

 వేసవి ఎండలో అతిగా తిరగడం వల్ల ఏర్పడిన అతి దాహంతో బాధపడే వారికి వరి బియ్యం  వండి వార్చిన గంజిలో తెలకపిండిని మెత్తగా నూరి శరీరానికి రాస్తే దాహం అతి త్వరగా తగ్గిపోతుంది. 

 దానిమ్మ పండ్ల రసానికి సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది.

 ధనియాల కషాయంలో చక్కెర, తేనె కలిపి తాగితే దాహం తగ్గుతుంది. 

 వేసవి కాలం దాహం అనిపించినపుడు గ్లాసు చల్లని నీటిలో అర చెంచాడు ఉప్పు కలిపి తాగుతుంటే త్వరగా దాహం తగ్గుతుంది. 

 పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం తగ్గి వడదెబ్బ నుంచి కోలుకుంటారు.

 వేసవిలో మిరియాలు, అల్లం, నిమ్మరసం కలిపిన చెరుకు రసం తాగితే త్వరగా దాహాన్ని తగ్గిస్తుంది.

 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి చేసిన పాకంలో నిమ్మరసం, కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తాగితే దాహం వెంటనే తగ్గుతుంది. 

 పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే దాహాన్ని వెంటనే అదుపు చేస్తుంది.

Posted On 3rd May 2017

Source andhrajyothi