చల్ల మిరపకాయలు
చల్ల మిరపకాయలు

కావలసినవి: 

పచ్చిమిర్చి - అరకేజి,

కాస్త పుల్లగా ఉన్న మజ్జిగ (మరీ పలుచగా లేదా చిక్కగా ఉండకూడదు) - ఒక లీటరు,

ఉప్పు - రుచికి సరిపడా.

 

తయారీ: సన్నగా కాకుండా కాస్త లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి. లేత ఆకుపచ్చ రంగువి అయితే తక్కువ కారం ఉంటాయి. ముదురాకుపచ్చ మిర్చికి ఘాటు ఎక్కువ. అందుకని మీ రుచికి తగ్గ వాటిని ఎంపిక చేసుకోవాలి. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేలా ఆరబెట్టాలి లేదా పొడి బట్టతో తుడిచేయాలి. వెంటనే తయారీ మొదలుపెట్టొచ్చు లేదా ఒకట్రెండు గంటల తరువాత అయినా మొదలుపెట్టొచ్చు. పచ్చిమిర్చి తొడిమెలు తీసేయకుండా... కింది నుంచి నిలువుగా చీల్చాలి. లేత ఆకుపచ్చ మిర్చి అయితే గింజలు ఉంచొచ్చు.

 

అదే ముదురాకుపచ్చవి అయితే ఘాటు ఉంటుంది కాబట్టి గింజలు తీసేయాలి. మజ్జిగలో ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి పూర్తిగా మునిగేలా మజ్జిగ పోయాలి. మూతపెట్టి మూడు రోజుల పాటు కదపకుండా అలానే ఉంచాలి. మూడు రోజుల తరువాత వాటి రంగు మారుతుంది. అప్పుడు మజ్జిగలో ఉన్న మిర్చిని నెమ్మదిగా పిండి ప్లాస్టిక్‌ షీట్‌ మీద వేసి సాయంత్రం వరకు ఎండబెట్టాలి. ఆ మజ్జిగను మాత్రం పారబోయొద్దు. సాయంత్రం మళ్లీ పచ్చిమిర్చిని ఆ మజ్జిగలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మళ్లీ వాటిని పిండి సాయంత్రం వరకు ఎండబెట్టాలి. మళ్లీ మజ్జిగలో నాననివ్వాలి. ఇలా ఐదారు రోజుల పాటు చేస్తే మజ్జిగని మిర్చి పూర్తిగా పీల్చేస్తుంది.

 

మజ్జిగ అయిపోయాక మరో కొన్ని రోజులు మిర్చిని ఎండబెట్టాలి. ఈ పద్ధతంతా పూర్తవడానికి పది పన్నెండు రోజులు పడుతుంది. బాగా ఎండాక గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. కాగబెట్టిన నూనెలో ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేగించిన చల్లమిరపకాయలు తింటుంటే ఆ టేస్టే వేరు అనాల్సిందే. పప్పు, సాంబార్‌, రసం, పెరుగన్నంతో స్పైసీగా వీటిని తినేయొచ్చు. ఈ మిర్చిలోనే కొందరు జీలకర్ర పొడి, మసాలాలు కూరి ఎండబెడతారు. నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు.

Posted On 20th May 2017

Source andhrajyothi