టమోటా తో క్యాన్సర్‌కు కళ్లెం
టమోటా తో క్యాన్సర్‌కు కళ్లెం

పండులా పచ్చిగా తిన్నా.. కూరలా వండుకొని తిన్నా టమోటా రుచే వేరు. ఇది క్యాన్సర్‌.. ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ తోడ్పడుతుందని ఇటలీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. టమోటా సారం జీర్ణాశయ గోడల్లో క్యాన్సర్‌ కణాలు వృద్ధి కాకుండా అడ్డుకుంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించటంతో పాటు క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందటానికి తోడ్పడే ప్రోటీన్లను అడ్డుకుంటున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. ఇలా ఇది క్యాన్సర్‌ కణాలు మరణించేలా ప్రేరేపిస్తుండటం విశేషం. అయితే టమోటాల్లోని లైకోపేన్‌ వంటి ఏదో ఒక రసాయనం కాకుండా మొత్తంగా టమోటా సారంతో ఈ ప్రయోజనం కనబడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్‌ నివారణలో కొన్ని ప్రత్యేక పోషకాలను వినియోగించుకోవచ్చని, అలాగే సంప్రదాయ చికిత్సకు మద్దతుగా ఇలాంటి పద్ధతులు బాగా తోడ్పడగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు. జీర్ణాశయ క్యాన్సర్‌ ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యుపరమైన అంశాలు, దీర్ఘకాలంగా రక్తహీనత, పేగుల్లో వాపు ప్రక్రియ అధికంగా ఉండటం, హెచ్‌పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వంటివి దీనికి దారితీయొచ్చు. కొన్నిరకాల ఆహార అలవాట్లు కూడా దీనికి దోహదం చేయొచ్చు.

Posted On 13th June 2017

Source eenadu