ఈ యాప్స్ తో జాగ్రత్త...
ఈ యాప్స్ తో జాగ్రత్త...

మనం ఎక్కడున్నాం? ఎక్కడెక్కడకు వెళ్తున్నాం? ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాం? ఏమేం చేస్తున్నాం?.. ఇలాంటి వివరాలన్నింటినీ మన స్మార్ట్‌ఫోన్లే రహస్యంగా వేరేవారికి చేరవేస్తున్నాయ్‌.. నిజం..! ఇదంతా ఓ అధ్యయనంలో బయటపడింది. ఇలా సమాచారాన్ని అందించడంలో యాప్‌లే గూఢచారుల్లా వ్యవహరిస్తున్నాయి. సమాచారాన్ని స్వీకరిస్తున్న సంస్థల్లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉండడం విశేషం. ఫోన్లలో ఉండే 70%పైగా యాప్‌లు మన వ్యక్తిగత సమాచారాన్ని తృతీయ పక్ష కంపెనీలకు వెల్లడిస్తున్నట్లు దీనిలో వెలుగు చూసింది. వాడకందారులకు తెలియకుండానే ఎంత సమాచారాన్ని సేకరించవచ్చనేది స్పెయిన్‌కు చెందిన ఒక సంస్థ పరిశోధకులు విశ్లేషించారు. దీని కోసం వారు ‘లుమెన్‌ ప్రైవసీ మానిటర్‌’ అనే మరో యాప్‌నే అభివృద్ధి చేశారు. ఏయే రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి పంపిందీ ఈ యాప్‌ ద్వారా తెలుస్తుంది.

ఇలా ఎందుకు చేస్తారంటే..:

వ్యాపార ప్రకటనలు పంపించడానికి, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌ల ద్వారా సేకరిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ‘70% పైగా యాప్‌లు కనీసం ఒక ట్రాకర్‌కు, 15%యాప్‌లైతే అయిదుకు మించిన ట్రాకర్లతో అనుసంధానమై ఉన్నాయి. చరవాణి విశిష్ఠ గుర్తింపు సంఖ్య కూడా వీరికి తెలిసిపోతోంది. ఇలా సమాచారం వెళ్తున్న విషయం చాలామందికి తెలియదు. వినియోగదారులు ఏయే వెబ్‌సైట్లను తరచూ వీక్షిస్తుంటారో కూడా యాప్‌లే చెప్పేస్తున్నాయి. తద్వారా వారి ఇష్టాయిష్టాలన్నీ వేరేవారికి తెలుస్తున్నాయ’ని వారు వివరించారు.

Posted On 13th June 2017

Source eenadu