సోషల్‌ మీడియాలో ప్రతిదీ పంచుకోవద్దు..
సోషల్‌ మీడియాలో ప్రతిదీ పంచుకోవద్దు..

వాట్సాప్‌ చూడటంతోనే దినచర్య మొదలవుతోంది.. రోజులో ఎక్కడికెళ్లాం.. ఏం చేస్తున్నాం అనే విషయాలను ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తే కానీ నిద్ర పట్టదు.. వీటిని చూసిన స్నేహితులు, బంధువులు లైక్‌లు, కామెంట్లు పెట్టగానే ఆనందపడిపోతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏదీ దాచుకోకుండా సామాజిక మాధ్యమాల్లో అన్నీ పంచుకొంటున్న పరిస్థితితో సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
మన సమాచారం సంబంధం లేని వ్యక్తులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం అని ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు చెబుతున్నా.. ఎంత కొంత అపరిచితుల చేతుల్లోకి చేరుతోందని ఓ సంస్థ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. అందుకు కారణం మన సెంటిమెంట్లే. సాధారణంగా వేర్వేరు ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు మర్చిపోకుండా ఉండాలని ముద్దుపేర్లు, పిల్లల పేర్లు, పుట్టిన తేదీలుపెట్టుకోవడం చాలామంది చేస్తుంటారు.ఇవే హ్యాకర్ల పనిని సులువు చేస్తున్నాయి. వీటి సాయంతో ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు. ముఖ్యంగా 5 అంశాలను మీలోనే దాచుకోండి..ఇప్పటికే బహిర్గతమై ఉంటే వెంటనే తొలగించండని నిపుణులు సూచిస్తున్నారు.ఇవి వద్దు...
1. పుట్టిన తేదీ... 
మనకు గుర్తున్నా లేకున్నా.. అప్పటికే ఫేస్‌బుక్‌లో పుట్టిన తేదీ వివరాలు వెల్లడించి ఉంటాం. కొద్దిరోజుల ముందు నుంచే ఆ సమాచారం స్నేహితులకు వెళుతుంది. మధ్యమధ్యలో గుర్తు చేస్తుంది. దీంతో స్నేహితుల శుభాకాంక్షలతో మీ పుట్టినరోజు అనే విషయం గుర్తుకొస్తుంది. ఇది ఆనందకరమే అయినా.. ఈ సమాచారం చాలు మీ బ్యాంకుఖాతా వివరాలు తెలుసుకోవడానికి!
2. మొబైల్‌ నంబరు.. 
స్నేహితులు, బంధువులు, నిపుణుల మొబైల్‌ నంబరు కావాలంటే ఇదివరకు చాలా కష్టపడాల్సి వచ్చేది. సోషల్‌ మీడియా పుణ్యమా అని దేశ, విదేశాల్లో ఉన్నవారి నంబర్లనూ సులువుగా తెలుసుకోగల్గుతున్నాం. ఇది ఒకవైపే.. రెండో కోణంలో అపరిచితుల చేతుల్లోకి వెళితే తరచూ ఫోన్‌ చేసి వేధింపులు, బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంది.
3. చిన్నారుల ఫొటోలు 
పిల్లల ఫొటోలు ఎక్కడైనా తీస్తే.. అందులో వారు ముచ్చటగా ఉంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటాం. ఇదీ ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. క్రమంగా పిల్లల్ని చిన్నవయసులోనే ఆన్‌లైన్‌కు అలవాటయ్యేందుకు ఒకరకంగా పెద్దలే దోహదం చేస్తున్నట్లవుతుంది. పిల్లల పాఠశాల, అమ్మాయిల కళాశాలల వివరాలు తెలిసేలా పోస్టులు మంచిది కాదు.
4. ఎక్కడ ఉన్నామనేది.. 
విహారానికి వెళ్లినా.. వూరెళ్లినా అక్కడ దిగిన ఫొటోలను వెంటనే సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తుంటారు. వీరు ఎక్కడ ఉన్నారనేది సులువుగా గుర్తించేలా ఈ పోస్టులు ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇదీ నష్టం చేస్తుంది. ఇటువంటి విషయాల్లో ఎంత వరకు, ఏది షేర్‌ చేయాలో అంతవరకే పరిమితమైతే ఇబ్బందులు రావు. తాము ఎక్కడ ఉన్నామో తెలిపే లొకేషన్‌ ట్యాగ్‌ కూడా వద్దని నిపుణులు వివరిస్తున్నారు.
5. బోర్డింగ్‌ పాస్‌లు.. 
కొంత మంది అత్యుత్సాహంగా తమ విమాన టిక్కెట్ల బోర్డింగ్‌ పాస్‌లను షేర్‌ చేస్తుంటారు. బార్‌కోడ్‌ సైతం కన్పించేలా షేర్‌ చేస్తుండటం మొదటికే మోసం తెస్తుందంటున్నారు.
డిజిటల్‌ డీఎన్‌ఏ ఇది.. 
చేతి వేలిముద్రలతో మీ పుట్టు పుర్వోత్తరాలన్నీ చెప్పవచ్చు. అలాంటిదే డిజిటల్‌ డీఎన్‌ఏ. మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే ఫొటోలు, చేసే కామెంట్లు, లైక్‌లను బట్టి మీ ఇష్టాలేంటి, ఇష్టపడనవి ఏవి.. ఇలా సమస్తం బహిర్గతం అవుతోంది. మీకు జ్ఞప్తికి తెచ్చుకుంటే... మీ పేజీ, మీ మెయిల్స్‌కు ఆ తరహా ప్రకటనలు రావడం గుర్తించొచ్చు.
ఫేస్‌బుక్‌ను రెండువందల కోట్ల మంది వాడుతున్నారని తాజాగా ప్రకటించారు. అంటే చైనా కంటే.. భారత్‌ జనాభా కంటే ఎక్కువ జనాభా సామాజిక మాధ్యమాల్లో ఉన్నట్లు. ఎంతో ఉపయోగం ఉండటం.. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చింది కాబట్టే వినియోగిస్తున్నారు.
వినియోగిస్తున్న అందరూ ఒకలా ఉండరు. దుర్వినియోగం చేసేవారూ ఉంటారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు .. గ్రామాల నుంచి పట్టణాలకు వెళుతుంటే ఇబ్బందులు ఉంటాయంటూ ముందే జాగ్రత్తలు చెబుతుంటారు. మరీ అలాంటిది వందల కోట్ల మంది వినియోగిస్తున్న సోషల్‌ మీడియాతోనూ సమస్యలు ఉంటాయని, జాగ్రత్తపడాలని చెప్పేవారు లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి.
14 ఏళ్ల వయసు పిల్లల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారు. వీరు ఏం చెప్పినా నమ్మేస్తారు. తొందరగా ప్రభావితమయ్యే వయసు అది. వీరికి పెద్దలు, పాఠశాలలు, ప్రభుత్వం... సామాజిక మాధ్యమాల మంచి చెడులపై అవగాహన కల్పించడం, కార్యశాలలు నిర్వహించడం వంటివి చేపడితే ప్రయోజనం ఉంటుంది.
వ్యక్తిగత సమాచారం మాధ్యమాల్లో పంచుకోవద్దు. తాము ఎక్కడ ఉన్నామో తెలిసే ఫొటోలు పెట్టడం వల్ల ఇంట్లో ఎవరూ లేరని దొంగతనాలు జరుగుతున్నాయి.. ఇప్పుడే పిల్లాడిని పాఠశాలలో దించానని ఒక తల్లి ఫొటో పోస్ట్‌ చేస్తే దాని ఆధారంగా ఆ పిల్లాడిని పాఠశాల నుంచి అపహరించే ప్రమాదం లేకపోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని గుర్తించాలి.

Posted On 29th June 2017

Source eenadu