TCS లో 11వేల ఉద్యోగాలు
TCS లో 11వేల ఉద్యోగాలు

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) 2016-17 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో 11,500మంది ఉద్యోగులను నియమించింది. అమెరికాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల పట్టభద్రులు, బి-స్కూల్స్‌ నుంచి వచ్చిన వారూ ఇందులో ఉన్నారని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా విదేశాల్లో వీసా సంబంధిత సవాళ్లను అధిగమించేందుకు ఈ నియమాకాలు చేపట్టినట్లు వెల్లడించింది.

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా 79,000 ఉద్యోగులను నియమించగా, నికరంగా 33,380 మందిని చేర్చుకోవడం ద్వారా సంస్థ ఉద్యోగుల సంఖ్య 3.87లక్షలకు చేరింది. విదేశాల్లో స్థానికులకు ఉద్యోగాలను ఇవ్వడం వల్ల ఐటీ అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. అయితే ఇటీవల కాలంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు వర్క్‌ వీసాకు సంబంధించి నియమ, నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకే ఆసక్తి చూప్తున్నాయి.

‘వివిధ దేశాల్లో స్థానిక నియమాకాల ప్రక్రియ బాగుంది. గత ఆర్థిక సంవత్సరంలో 11,500మంది ఉద్యోగులన నియమించాం. అమెరికాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి, బిజినెస్‌ స్కూళ్ల నుంచి ఎంపికైన వారు ఉన్నారు’ అని టీసీఎస్‌ సీఈవో, ఎండీ, రాజేష్‌ గోపినాథన్‌ తెలిపారు. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. 2016లో 16,173మందిని టీసీఎస్‌ ఉద్యోగులుగా నియమించింది. అయితే ఈ ఉద్యోగాలు ఏయే దేశాల్లో నియమించిందీ కంపెనీ వివరించలేదు.

Posted On 24th April 2017

Source eenadu