అమెరికా పిలుస్తోంది
అమెరికా పిలుస్తోంది

ఈ విద్యా సంవత్సరం అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి అనుమతి పొందిన భారతీయ విద్యార్థులకు ఇవే నా శుభాభినందనలు. అమెరికాలో 4,500కు పైగా ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వాటికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో చాలామందికి ప్రవేశాలు లభించాయి. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందిన అనేకులు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో నాయకత్వ స్థానాలకు ఎదిగారు. నవీకరణ సాధకులై ప్రగతి రథాన్ని ముందుకు ఉరికించారు. ఈ విజయ సారథుల సరసన చేరే అవకాశం దక్కినందుకు అమెరికన్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన యువ విద్యార్థులు గర్వించాలి. అమెరికా విద్యా ప్రాంగణాల్లో వెల్లివిరిసే చురుకుదనం, స్వేచ్ఛాతత్వం, నాణ్యమైన బోధనలు ఈ యువతీయువకుల జీవితాలను మార్చేయనున్నాయి. మీకు ముందు ఎందరో ప్రముఖ భారతీయ రాజకీయ నాయకులు, పరిశ్రమాధిపతులు, కళాకారులు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, నటీనటులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారని గమనించాలి. ప్రస్తుతం 1.66 లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య లక్ష మాత్రమే. స్వల్పకాలంలోనే విద్యార్థుల సంఖ్య ఇంతగా పెరిగిపోవడం నిజంగా విశేషం. రెండు దేశాల విద్యార్థులు, విద్యాసంస్థల మధ్య పటిష్ఠ బంధం, భాగస్వామ్యాలను ఏర్పరచడానికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఈ సంవత్సరం కూడా ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్వాగతం చెప్పడానికి అమెరికా సిద్ధంగా ఉంది.
అమెరికాలో తమకు నచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడానికి భారతీయ విద్యార్థులు విస్తృతంగా అన్వేషిస్తారు. ఇది విద్యార్థులు ఎంతో లోతుగా ఆలోచించి తుది అడుగు వేయాల్సిన శ్రమభరితమైన వ్యవహారం. వారికి కావలసిన సమాచారాన్ని అందించి, వారి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి అమెరికన్‌ విశ్వవిద్యాలయాలూ శ్రమిస్తాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రక్రియలో చురుగ్గా భాగస్వాములవుతారు. తమ బిడ్డలకు ఆర్థికంగా, భావోద్వేగపరంగా అండనిస్తారు. గత ఏడాది మా కుమార్తెకు, మాకూ ఇది అనుభవమైంది. ఫలానా విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణాలను వివరించే వ్యాసాన్ని దరఖాస్తు ఫారానికి జత చేయడం మొదలు, ప్రామాణిక ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవడం వరకు ఆమె ఎన్నో గంటలు శ్రమించింది. సరైన విశ్వవిద్యాలయ ఎంపిక అనేది చాలా పెద్ద నిర్ణయం. ఇక్కడ పొరపాటు ఎంపికకు తావు ఉండరాదు. అయితే తొలి, మలి పరిశీలనల్లో సరైనది కాదనుకున్న కళాశాలే చివరికి విద్యార్థికి అన్నివిధాలా సరిపోయే అత్యుత్తమ సంస్థగా తేలవచ్చు. కొన్నిసార్లు మనకు యోగ్యమైనది ఏదో మనమే గ్రహించలేకపోవచ్చు. ప్రస్తుతం దాదాపు పది లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. భారత్‌ తదితర దేశాల విద్యార్థులకు నిస్సందేహంగా అమెరికాయే అగ్రశ్రేణి విద్యా గమ్యం. అమెరికా అందించే ఉన్నత విద్య అసమానం. దీనికితోడు అమెరికాతో జీవిత బంధం ఏర్పరచుకొనే అవకాశం ఉండటం, విదేశీ విద్యార్థులకు మరొక ఆకర్షణ. అమెరికా విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి సంఘాలు ఈ బంధానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. నా విద్యాభ్యాసం పూర్తయి మూడు దశాబ్దాలు గడచినా, ఇప్పటికీ నా కళాశాల రోజులు బాగా గుర్తున్నాయి. ఆనాటి మిత్రులతో నేటికీ స్నేహం కొనసాగిస్తున్నాను. అంతర్జాతీయ విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని గత ఏడాది నవంబరులో అమెరికా రాయబార కార్యాలయం, భారత్‌కు తిరిగివచ్చి స్థిరపడిన పూర్వ విద్యార్థుల వీడియోలు కొన్ని తీసింది. నేడు ఈ పూర్వ విద్యార్థులు స్థానిక క్లబ్బులుగా ఏర్పడి, జాతీయ, అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారానికి తమ వంతు సాయం అందిస్తూ భారత్‌, అమెరికా సంబంధాలకు బలోపేతం చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకొంటున్నవారు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ (educationusa.state.gov)ను సంప్రతించాలని నా సలహా. భారత్‌లో ఏడు నగరాల్లో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సేవా కేంద్రాలున్నాయి. అవి అమెరికాలోని ఉన్నత విద్యావకాశాలపై ఆన్‌లైన్‌లో స్పష్టమైన, కచ్చితమైన, సమగ్రమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇక్కడి అమెరికన్‌ ప్రాంగణాలు, కేంద్రాలతో పాటు స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోనూ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ బృందం భారత్‌లోని ఏడు నగరాల్లో పర్యటిస్తుంది. భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని అమెరికా ఆదరిస్తుంది. వేర్వేరు నేపథ్యాలున్న విద్యార్థులకు అండగా నిలుస్తుంది. అంతర్జాతీయ విద్యార్థులకు స్థానిక పరిస్థితులకు అలవాటు పడటానికి అమెరికన్‌ విద్యాసంస్థలు అన్ని విధాలుగా తోడ్పడతాయి. వారి విశిష్టతలను, వారి విభిన్న దృక్పథాలను గౌరవిస్తాయి. ఈ విలక్షణతలు అమెరికా విద్యా సంస్థలను, సమాజాన్ని సుసంపన్నం చేస్తాయి. నేడు అమెరికాలోని ప్రతి ఆరుగురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారత్‌ నుంచి వచ్చినవారే. విశ్వవిద్యాలయాలతోపాటు వాటి పరిసరాల్లోని పౌర సమాజానికి వీరి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి.
అమెరికన్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థులను సాదరంగా స్వాగతించి భద్రమైన వాతావరణం కల్పిస్తాయి. నా కుమార్తె కూడా ఒక విద్యార్థిని కాబట్టి ఈ అంశాలకు నేను ఎంతో ప్రాధాన్యమిస్తాను. గత వేసవిలో నా కుమార్తె కళాశాలలో చేరిన సమయంలోనే నేను విధి నిర్వహణ నిమిత్తం దిల్లీకి వచ్చాను. మా అమ్మాయి కొన్ని ఖండాల అవతల ఉంటే నేను ఇవతల ఉన్నానన్న మాట! కాబట్టి ఇక్కడి విద్యార్థులు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భద్రత, సంక్షేమాలకు విశేష ప్రాధాన్యమిస్తాయి. దీనికి వాటిని అభినందించాల్సిందే. అంతర్జాతీయ విద్యార్థులకు భరోసా ఇవ్వడానికి అనేక అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు జతకట్టి# You Are Welcome Here అంటూ పెద్దయెత్తున స్వాగత కార్యక్రమాన్ని చేపట్టాయి. విద్యార్థులకే నేరుగా తమ సందేశాన్ని అందిస్తున్నాయి. భారతీయ, ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు నేను కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. మీ జీవిత గమ్యాలను, వృత్తిపరమైన లక్ష్యాలను అందుకోవడానికి తోడ్పడే అమూల్య విద్యావకాశాలను మా విద్యాసంస్థలు అందిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఇవే నా శుభాభినందనలు!

Posted On 27th April 2017

Source eenadu