మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో అద్భుతం
మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో అద్భుతం

ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ సాంకేతికతతో సరికొత్త సంచలనం సృష్టించేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమవుతోంది. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకుని.. ప్రశ్నలడిగితే టక్కున సమాధానమిచ్చే అత్యద్భుత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ కసరత్తులు చేస్తోంది.

‘లిటరేట్‌ మెషిన్‌’గా పిలిచే ఆ అప్లికేషన్‌.. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేస్తుందట. మనం ఏదైనా విషయం చెబితే అర్థం చేసుకుంటుంది. పెద్దమొత్తంలో డాక్యుమెంట్లను ఇచ్చి అందులోంచి ప్రశ్నలడిగితే టక్కున సమాధానాలు చెబుతుంది. మనిషిలాగే మాటల్లోనైనా.. రాత పూర్వకంగానైనా సమాధానాలు ఇస్తుంది. ఫోటోలనూ గుర్తు పడుతుంది. అంతేకాదు ఏదైనా విషయంలో అనుమానం వస్తే ఎదురు ప్రశ్నలు కూడా వేస్తుంది. అలాంటి అద్భుతమైన అప్లికేషన్‌ను తీర్చిదిద్దే పనిలో తమ అనుభవజ్ఞులైన నిపుణులు నిమగ్నమై ఉన్నారని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చింజన్‌ ‘బింగ్‌’లోనూ ఈ అప్లికేషన్‌ సేవలు అందించనుందట. బింగ్‌లో ఏదైనా ప్రదేశం గురించి సెర్చ్‌ చేసి.. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రశ్నలడిగితే సమాధానాలు ఇస్తుందట. ఫలానా హోటల్‌ ఎక్కడ ఉంది? అక్కడి ఎలా వెళ్లాలి? దాని పనివేళలు ఏంటి? తదితర ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇస్తుందట.

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ అప్లికేషన్‌ను మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Posted On 6th May 2017

Source eenadu