హైదరాబాద్‌లో ర్యాన్సమ్‌వేర్‌
హైదరాబాద్‌లో ర్యాన్సమ్‌వేర్‌

కంప్యూటర్లను స్తంభింపజేసే సాఫ్ట్‌వేర్‌ (రాన్సమ్‌వేర్‌) దాడి ‘వాన్నా క్రై’ ప్రకంపనలు నగరంలోనూ కలకలం రేపుతున్నాయి. హ్యాకర్లు తమ కంప్యూటర్లపై పంజా విసిరి, డబ్బు కావాలని డిమాండ్‌ చేస్తున్నారంటూ పలువురు బాధితులు సైబర్‌నేర విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. రెండేళ్ల తర్వాత నగరంలో ఈ తరహా ఘటనలు ఇప్పుడు మళ్లీ నమోదవుతున్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన రెండు ఐటీ ఆధార సంస్థలు షవర్ణీ సాఫ్ట్‌వేర్‌, ఒప్పులెంట్‌తో పాటు.. వీసా సేవలందిస్తున్న మోర్‌ వీసాస్‌ కంపెనీ ప్రతినిధులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ మూడు సంస్థలపై హ్యాకర్లు ఒకేసారి దాడిచేశారు. 6 వేల అమెరికన్‌ డాలర్లు విలువచేసే బిట్‌కాయిన్‌లను ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఒక్కసారి వైరస్‌ ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌చేస్తే, నేరస్థులను పట్టుకోవడం సాధ్యంకాదని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లలో వినియోగిస్తున్న విండోస్‌ ఎక్స్‌పీ సాఫ్ట్‌వేర్‌ పైరేటెడ్‌ కావడంతో నేరగాళ్లు సులభంగా దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు.

వినియోదారుల వివరాలన్నీ లభ్యం 
వాన్నాక్రై సైబర్‌దాడి ద్వారా తమ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయంటూ షవర్ణీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రతినిధి సుజాత కాంతన్‌, మోర్‌వీసాస్‌కు చెందిన జామా సెబాస్టియన్‌, ఒపులెంట్స్‌ ప్రతినిధి శ్రీనివాసరెడ్డిలు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. డిమాండ్‌ చేసిన మొత్తాన్ని చెల్లించినా, హ్యాకర్లు వైరస్‌ను తొలగిస్తారన్న నమ్మకం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాన్సమ్‌వేర్‌ ద్వారా దాడులుచేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, ఉపయోగం ఉండదు. హ్యాకర్లు తమకు నచ్చిన నెట్‌వర్క్‌లను ఎంచుకుని దాడులు చేస్తున్నారు. బాధితులు బిట్‌కాయిన్‌లు (అంతర్జాలంలో సమాంతర కరెన్సీ) జమచేసినా వైరస్‌ తొలగిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వీరు తప్పుడు వివరాలతో లావాదేవీలను నిర్వహిస్తుంటారు. హ్యాకర్లు ఎవరన్నది గుర్తించడం సాధ్యంకాదనీ, వీరికి మాదకద్రవ్యాలు, ఆయుధాలను రహస్యంగా రవాణాచేసే డార్క్‌నెట్‌ వైబ్‌సైట్‌ నిర్వాహకులతో సంబంధాలుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బిట్‌కాయిన్‌లను తీసుకున్న ఖాతాలు, వెబ్‌సైట్లను గుర్తించినా, పెద్ద ప్రయోజనం ఉండదని పోలీసులు గుర్తించారు.

వదులుకోవడమే శ్రేయస్కరం 
హ్యాకర్లు పదేళ్ల క్రితం నుంచే వైరస్‌ను కంప్యూటర్లలోకి పంపుతూ, సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. కంప్యూటర్లపై రాన్సమ్‌వేర్‌ పంజా విసిరిన వెంటనే వాటిలోని సమాచారాన్ని వదులుకోవడం శ్రేయస్కరమని సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాషా తెలిపారు. 
* రెండేళ్ల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన పాలు, పాలపదార్థాలు తయారుచేసే ఓ సంస్థ, బేగంపేటలో వీసా సేవలు అందిస్తున్న మరో సంస్థ నెట్‌వర్క్‌లు రాన్సమ్‌వేర్‌ దాడికి గురయ్యాయి. 
* కొద్దినెలల క్రితం కేంద్ర నావికాదళం వైబ్‌సైట్‌పై హ్యాకర్లు సైబర్‌దాడులకు పాల్పడ్డారు. వేల డాలర్లు డిమాండ్‌ చేశారు. నావికాదళం అధికారులు అప్పటికప్పుడు కొత్త వ్యవస్థను తయారుచేసుకున్నారు.

Posted On 24th May 2017

Source eenadu