ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

ఆండ్రాయిడ్ వినియోగదారులపై సరికొత్త మాల్‌వేర్ పంజా విసురుతోంది. ‘జూడీ’ పేరుతో విజృంభిస్తున్న ఈ సైబర్ భూతం ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలో పాగా వేసినట్టు సమాచారం. ఈ వైరస్‌తో అనేక యాప్‌లు కుమ్మక్కవగా.. ఫ్యాషన్, కుకింగ్ గేమ్స్ ముసుగులో గూగుల్ ప్లేస్టోర్‌ని సైతం స్థావరంగా వాడుకున్నాయి. వీటిలో ఓ యాప్ అయితే ఏకంగా సంవత్సరం పాటు గూగుల్ ప్లేస్టోర్లో తిష్టవేయడం విశేషం.

సైబర్ సెక్యురిటీ సంస్థ ‘చెక్ పాయింట్’ కథనం మేరకు ఒక్కసారి ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే... ఇక సదరు ఆండ్రాయిడ్ ఫోన్ ‘జూడీ’ చేతిలోకి వెళ్లినట్టే. ఇన్‌స్టాల్ చేసింది మొదలు.. ఈ మాల్‌వేర్ సదరు ఫోన్ నుంచి యూజర్‌కి తెలియకుండానే గూగుల్ యాడ్‌లను క్లిక్ చేయడం మొదలు పెడుతుంది. తద్వారా ప్రకటనల ఆదాయం సైబర్ దొంగల జేబుల్లోకి వెళుతుంది. ఇంతకాలం నిద్రాణంగా నక్కిన ఈ దొంగ యాప్‌‌లను గూగుల్ ప్లేస్టోర్ ఇటీవలే గుర్తించింది. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని యాప్‌లను ఇప్పటికే ఏరివేసింది.

Posted On 30th May 2017

Source andhrajyothi