ఇక ధైర్యంగా ప్రొఫైల్‌ పిక్‌ పెట్టుకోవచ్చు
ఇక ధైర్యంగా ప్రొఫైల్‌ పిక్‌ పెట్టుకోవచ్చు

ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్‌ను అటు పురుషులు, ఇటు మహిళలు విరివిగా వాడుతున్నారు. అయితే, ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో మహిళలు ధైర్యంగా ప్రొఫైల్‌ పిక్చర్‌ను పెట్టుకోలేని పరిస్థితి! ఎవరైనా దాన్ని డౌన్‌లోడ్‌ చేసి.. మార్ఫింగ్‌ చేసి ఎక్కడ పోస్ట్‌ చేస్తారోనన్న భయం. అందుకే నేటికీ మహిళలు ఎఫ్‌బీలో ప్రొఫైల్‌ పిక్‌ను పెట్టేందుకు జంకుతుంటారు. ఈ పరిస్థితి గమనించిన ఫేస్‌బుక్‌.. మహిళల కోసం కొత్త టూల్‌ను పరిచయం చేసింది.
మహిళల ప్రొఫైల్‌ పిక్‌లను డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలు లేకుండా ఈ కొత్త టూల్‌ను ప్రవేశ పెడుతున్నట్లు సంస్థ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఆరతీ సోమన్‌ వెల్లడించారు. దీంతో పాటు ప్రొఫైల్‌ పిక్చర్లపై డిజైన్‌ వేసుకునే మరో సదుపాయాన్నీ కల్పించినట్లు తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా భారత్‌లో దీన్ని ప్రవేశపెడుతున్న ఫేస్‌బుక్‌.. ఇతర దేశాలకూ ఈ సదుపాయాన్ని పరిచయం చేయాలనుకుంటోంది.

ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ‘ప్రొఫైల్‌ పిక్‌ గార్డ్‌’ను మహిళలు ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఇతర వ్యక్తులు వారి ప్రొఫైల్‌ పిక్‌ను డౌన్‌లోడ్‌ చేయడం గానీ, షేర్‌ చేయడం గానీ, ఇతరులకు పంపించడం గానీ కుదరదు. అంతేకాదు ఫేస్‌బుక్‌లో స్నేహితులు కాకపోతే వారిని ఇతరులకు ట్యాగ్‌ చేయడం కుదరదు. ఇక స్క్రీన్‌ షాట్‌ తీసే అవకాశమూ ఉండదు. ఈ టూల్‌ను వినియోగించే వారి ప్రొఫైల్‌ పిక్చర్‌ చుట్టూ నీలం రంగు బోర్డర్‌ కనిపిస్తుంది. దీంతో పాటు అదనపు డిజైన్‌ లేయర్‌ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రొఫైల్‌ పిక్చర్‌ను ఇతరులు కాపీ చేయడం 75 శాతం తగ్గుతుందని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

Posted On 22nd June 2017

Source eenadu