ఇన్ఫోసిస్‌లో 11వేలమందికి ఉద్వాసన
ఇన్ఫోసిస్‌లో 11వేలమందికి ఉద్వాసన

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. సంస్థలోని 11వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందట. యాంత్రీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. శనివారం బెంగళూరులో కంపెనీ 36వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. బోర్డు సభ్యులు, కంపెనీ ప్రమోటర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. అవన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేసింది.

* సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులకు మధ్య వేతనాల విషయంలో ఇన్ఫోసిస్‌ అవగాహనతో ఉందని కంపెనీ ఏజీఎం స్థాయి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వేతనాలకు సంబంధించి మంచి అవగాహన ఉందన్న ఆయన వేతనాల అంతరాన్ని తగ్గిస్తామన్నారు. స్టాక్‌మార్కెట్‌ ఆధారంగా ప్రతిఫలాన్ని అందించడాన్ని పునర్వ్యవస్థీకరించామన్నారు.

* 2017 ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని షేర్‌హోల్డర్లకు సీఈవో విశాల్‌ సిక్కా లేఖ రాశారు. ముఖ్యంగా స్వదేశీ సంస్థల రక్షణ విధానం, ఉత్పత్తిలో పెరుగుదల, క్లెయింట్‌ల ఉన్నత ఆలోచనలు, కొత్త పోటీ ఇవన్నీ సవాళ్లేనని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్గతంగా సంస్థకు సంబంధించి కన్సల్టెంగ్‌ , ఫినాకిల్‌, బీపీవో వ్యాపారంలో స్థిరత్వం, వృద్ధిని తీసుకురావాలి. వీటితో పాటు దీర్ఘకాలంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేయాలి. కొత్త సేవలను ఒడిసి పట్టడం ద్వారా దీనిని సాధించాలి. ఈ కార్యక్రమం స్థిరమైన, లాభదాయకమైన వృద్ధి నమోదు చేయడం ద్వారా వాటాదారులకు లాభం చేకూరాలి’ అని సిక్కా తెలిపారు.

* యాంత్రీకరణ ప్రభావం కారణంగా 11వేల మంది ఉద్యోగులకు ఇప్పటికే ఉద్వాసన పలికారు. యాంత్రీకరణ తోడ్పాటుతో ఫుల్‌టైమ్‌ ఉద్యోగి ద్వారా ఆదాయం 1.2శాతం పెరిగింది. వినియోగం, ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది అని కంపెనీ తెలిపింది.

* ఇన్ఫోసిస్‌ బోర్డు, వ్యవస్థాపకుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అన్నీ మీడియా సృష్టేనని కంపెనీ పేర్కొంది. వ్యవస్థాపకులు చేసే వ్యాఖ్యలను గౌరవిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆర్‌.శేషసాయి తెలిపారు.

* మార్చి 31, 2017 నాటికి ఇన్ఫోసిస్‌ వద్ద రూ.12,222 కోట్లు నగదు, అందుకు సమానమైన వాటి రూపంలో కలిగి ఉందని తెలిపింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.24,276 కోట్లు ఉండటం గమనార్హం. ఇక సంస్థ డిపాజిట్లు రూ.6,931 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఈ మొత్తం రూ.4,900 కోట్లుగా ఉంది.

* 2018 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు రూ.13వేల కోట్లు లేదా 2 బిలియన్‌ డాలర్లను చెల్లించనున్నట్లు గుర్తించింది. దీనిని డివిడెండ్‌ లేదా షేర్ల బైబ్యాక్‌ రూపంలో చెల్లిస్తారనే దానిని తర్వాత నిర్ణయించనున్నారు.

* 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతీ షేరుకూ రూ.14.75 డివిడెండ్‌గా చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ద్వారా రూ.4,061 కోట్లు కంపెనీ నుంచి వెళ్లిపోతుందని పేర్కొంది.

* ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆర్‌ శేషసాయి మే 2018లో పదవీ విరమణ పొందనున్నారు.

Posted On 24th June 2017

Source eenadu