ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర
ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1917లో యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. ఓయూ స్థాపనకు సంబంధించిన ఫర్మానాను అదే ఏడాది ఏప్రిల్‌ 26న జారీ చేశారు. ఆబిడ్స్‌ గన్‌ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.ఆ తర్వాతి కాలంలో ప్రస్తుతం ఉన్న ఓయూకు మారిపోయాయి.

వందేళ్లుగా విద్యా సుగంధాల్ని ఎల్లెడలా వెదజల్లుతున్న ఉస్మానియా విశ్వ విద్యాలయం విశేషాలు, ఆర్ట్స్‌ కళాశాల శంకుస్థాపన మొదలుకొని ఇతరత్రా అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.. పాత నగరంలోని పురానాహవేలీ మస్రత్‌మహల్‌ భవన సముదాయంలో కొలువైన నిజాం మ్యూజియం ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనలోని ప్రత్యేక ఛాయాచిత్రాలు, కళాఖండాలు... ఓయూ కీర్తిప్రతిష్ఠలను, ఘనతను కళ్లకు కడుతున్నాయి. మ్యూజియానికి వస్తున్న సందర్శకులు... వర్సిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అలనాటి చిత్రాలపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తుండటం విశేషం.

కొల్లలుగా అనువాదాలు 
వర్సిటీ అభివృద్ధికి పలు భాషలలోని ఎన్నో పుస్తకాలను ఉర్దూలోకి అనువదించారు. 1948 వరకు సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సహా పలు సబ్జెక్టులకు సంబంధించి, 500 పుస్తకాలను తర్జుమా చేశారు.

 



బ్రిటిష్‌ వ్యతిరేకత లేకుండా...

ప్రజావిద్యను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఏడో నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వర్సిటీ ఏర్పాటు విషయంలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉర్దూ మాధ్యమంలో విద్యాభ్యాసానికి అవకాశం కల్పించాలనేది ఆయన ఉద్దేశం. దీంతోపాటు ఆంగ్ల పరిజ్ఞానం పెంచాలని భావించారు. అందుకే ఇంగ్లిషును విద్యార్థులు నిర్బంధ భాషగా తీసుకోవాలని సూచించారు. వర్సిటీ ఏర్పాటు, నిర్వహణలో ఆంగ్లేయుల వ్యతిరేకత ఎదురుకాకుండా చూడటం దీని వెనుక ఉన్న మరో ఉద్దేశం.



సకుటుంబ సమేతంగా... 

1934 జులై 5న ఆర్ట్స్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన తనయుడు ముకరంజా బహదూర్‌, కోడలు ప్రిన్సెస్‌ దుర్రెషహవార్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బంగారు తాపీ, తట్ట నమూనాలను నాటి వర్సిటీ అధికారులు... నిజాంకు బహూకరించారు. ఆ ఫొటోలూ ప్రదర్శనలో కొలువుదీరాయి.



వెండి నమూనా... 

భిన్నమతాల వాస్తు నైపుణ్యాలకు నిలయమైన ఆర్ట్స్‌ కళాళాల భవనానికి పునాది రాయి పడిన చిత్రం, సుమారు 120 కిలోల వెండితో చేసిన భవన నమూనా ఆకట్టుకుంటాయి.

యూనివర్సిటీకి వెండి నమూనా! 
నిజాం మ్యూజియంలోని ఆర్ట్స్‌ కళాశాల భవనం వెండి నమూనాను శతాబ్ది ఉత్సవాల తొలిరోజున... తాత్కాలికంగా యూనివర్సిటీలో ప్రదర్శించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు మ్యూజియం అధికారులకు విన్నవించారు. ఈ అంశంలో సాధ్యాసాధ్యాలకు సంబంధించి మ్యూజియం అధికారులు నిబంధనలను పరిశీలిస్తున్నారు.

 



ఐదేళ్లలోనే...

నిజాం శంకుస్థాపన చేసిన తర్వాత అయిదేళ్లలో అద్భుత ఆర్ట్స్‌ కళాశాల భవనం... 1939 డిసెంబరు 4న ఆవిష్కృతమైంది. రూ.36 లక్షల నిధులతో ఈ భవన నిర్మాణం పూర్తి కావడం విశేషం.



ఎంతో శ్రద్ధగా... 

ప్రస్తుతమున్న విశ్వ విద్యాలయ నిర్మాణం కోసం అప్పట్లో నగరానికి దాదాపు మూడు మైళ్ల దూరంలో.. ఆరు గ్రామాల పరిధిలోని 16 వందల ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్ట్స్‌ కళాశాల భవన నిర్మాణంలో బౌద్ధ, జైన, ఇస్లాం సంప్రదాయాలు స్పష్టంగా కనిపిస్తాయి.. ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌... భవన నిర్మాణంపై చూపించిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. ప్రతిదీ క్షుణ్నంగా పరిశీలించేవారు.. ఎర్రటి ఎండలోనూ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేవారని అనేక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వర్సిటీలో ఉర్దూ మాధ్యమంలో బోధనల్ని ప్రారంభించినందుకు నిజాం నవాబును విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రశంసించారు.



మొట్ట మొదటి... స్వదేశీవర్సిటీ! 

పరభాషా సంకెళ్ల నుంచి స్వేచ్ఛగా బయటపడి... ప్రజలందరికీ మనదైన విద్య అందుబాటులో ఉండే రోజుకోసం ఎదురు చూస్తున్నాన్నేను. ఉస్మానియా నిజమైన విద్యాపీఠం... భారతదేశంలో కెల్లా మొట్ట మొదటి స్వదేశీ యూనివర్సిటీ.

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

Posted On 23rd April 2017

Source eenadu