కరొనా నయం కాకుండానే... ఇంటికి వెళ్లిన పోలీసు అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి గత నెల 24వ తేదీ కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ ఎర్రగడ్డ లో ఉన్న ఛాతీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే ఆయనకు పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జ్ చేయడం ఆయన ఇంటికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవడం చక చకా జరిగిపోయాయి.

అసలేం జరిగిందంటే ...

గురువారం ఆయనకు చేసిన పరీక్షల్లో మొదటి నివేదికలో కరోనా నెగిటివ్‌ అని వచ్చింది. అయితే మరో నిర్ధారణ కోసం శాంపిల్స్ ను గాంధీ ఆసుపత్రి కి పంపారు. ఆ నివేదిక వచ్చేలోపే ఆయనను డిశ్చార్జ్ చేసేశారు. దీంతో ఆ రోజు రాత్రి ప్రయివేటు అంబులెన్సులో కొత్తగూడెంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయారు.

అయితే ఈలోగా గాంధీ ఆసుపత్రికి పంపిన శాంపిల్స్ లో కరొనా పాజిటివ్ అని నివేదిక వచ్చింది. తమ పొరపాటును తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే కొత్తగూడెం వైద్య ఆరోగ్య విభాగానికి సమాచారమిచ్చారు. దీంతో ఆ అధికారిని హుటాహుటిన మళ్ళీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి తరలించారు.

వాస్తవానికి నిబంధనల ప్రకారం మొదటి పరీక్షలో నెగెటివ్ అని వచ్చినా కూడా 24 గంటల్లో మరో పరీక్ష నిర్వహించి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నెగెటివ్ వస్తే బీపీ, పల్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలి.

కానీ అలాకాకుండా రెండవ పరీక్ష నివేదిక రాకుండానే ఆ అధికారిని డిశ్చార్జ్ చేయడం, తర్వాతి నివేదిక లో పాజిటివ్ రావడంతో కొంత కలకలం రేగింది. ఈ విషయం పై ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ను వివరణ కోరగా, బాధితుడి తుది నివేదిక రావడంలో కొంత ఆలస్యమైందని, అందగానే వెనక్కి పిలిపించామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు

అయితే ఆ పోలీసు అధికారిని కొత్తగూడెం తీసుకెళ్లిన అంబులెన్స్ డ్రైవర్‌ను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆ అధికారి కుటుంబసభ్యులను కూడా రెండోసారి క్వారంటైన్‌కు తరలించారు.

Posted On 11th April 2020