కరోనాను కట్టడి చేయడంలో... కేరళ దేశానికే ఆదర్శం

ప్రపంచానికి మార్గదర్శకం క్యూబా… దేశానికి మార్గదర్శకం కేరళ
క్యూబా వైద్యుల కర్మాగారం అయితే… కేరళ నర్సుల కర్మాగారం
క్యూబా వైద్యుల సేవల్ని ఈ. యూ పార్లమెంట్ స్మరిస్తే... కేరళ నర్సుల సేవల్ని బ్రిటిష్ పార్లమెంట్ స్మరించింది.

దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది జనవరి 30 న కేరళలో వూహాన్ నుంచి వచ్చిన విద్యార్థినికి. ఒక్క కేసే కదా అని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆరోగ్య శాఖ మంత్రి సంబంధిత అధికారులతో పరిస్థితి చర్చించారు ఎందుకంటే 3కోట్ల30లక్షల జనాభా ఉన్న చిన్న రాష్ట్రం కేరళ లో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
(8 కోట్ల పైగా జనాభా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్క హైదరాబాద్ మాత్రమే మిగిలిన వాటిల్లో ప్రయాణాలు అత్యల్పం) కేరళ నుంచి విదేశి రాకపోకలు ఎక్కువ.

కేరళ ప్రభత్వం తీసుకున్న చర్యలేంటంటే...

  • దేశం మొత్తం ఫిబ్రవరిలో ట్రంప్ పర్యటన కోసం,వేసుకునే బట్టలు కోసం,కడుతున్న గోడ కోసం తలమునకలై చాలా బిజీగా ఉన్న సమయానికే కేరళ కరోనాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.
  • క్వారంటాయిన్ అనే పదం దేశానికి సరిగా పరిచయం లేని ఫిబ్రవరి మొదటి వారానికి కేరళలో 2000 మంది వైద్యుల పర్యవేక్షణలో క్వారంటాయిన్ చేయబడ్డారు.
  • ఒకే ఒక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 276 మంది డాక్టర్ల నియామకం చేశారు.
  • మార్చ్ మొదటివారానికే కేరళ గ్రామాల్లో సైతం భౌతిక దూరం,చేతుల పరిశుభ్రత లాటి ప్రాధాన్యత తెలిసింది.
  • పాజిటివ్ కేసులు300 పైన ఉన్నా మృతులు ఇద్దరే.
  • దక్షిణ కొరియా తరహాలో పాజిటివ్ టెస్ట్ లకు కియోస్క్ లు ఉపయోగిస్తున్నారు అంతకుముందు ఆరు ప్రత్యేక లబోరేటరీలు ఏర్పరిచారు.

ఇక లాక్ డౌన్ తర్వాత కేరళ ప్రభుత్వం సామాన్యులకు అందిస్తున్న సౌకర్యాలు వేరే ఏ రాష్ర్టం అమలుచేయలేని స్థాయిలో ఉన్నాయి. హాండ్ సానిటైజేషన్లను అదనంగా పరిశ్రమ శాఖ ఉత్పత్తి చేయిస్తే,మాస్కులు ఖైదీలతో జైళ్ల శాఖ చేయించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ మర్కజ్ కు వేల సంఖ్యలో పాల్గొంటే కేరళ నుంచి హాజరైన వారు కేవలం షుమారు300 మందే కారణం అప్పటికే ప్రభుత్వం కలిగించిన అవగాహన. ఒకవేళ ఆ మర్కజ్ లాటివి కేరళ రాష్ట్రంలో జరిగితే ఎటువంటి ప్రచారాలు సాగేవో ఊహించుకోడానికే భయంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం కేరళ ను చూసి మార్చి మొదటి వారంలో ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించినా, ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు అనుమతి నిరకరించినా, లేదా విదేశీల నుంచి వచ్చినవారిని ఫిబ్రవరి నుంచి కేరళ తరహాలో క్వారంతాయిన్ చేసినా నేటి పరిస్థితి ఉండేదికాదు కదా!

ప్రాణాలు, కేసులు ఎక్కువ సంఖ్యలో రాకున్నా,యావత్ దేశం లాక్ డోన్ వల్ల ఎంత ఆర్ధిక నష్టం, పూడ్చుకోలేనిది కదా.
ధనిక రాష్ట్రంతో పాటు, గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి గా ఉన్న తెలంగాణ కూడా ఉద్యోగుల జీతాలు వాయిదాల్లో ఇవ్వాల్సిన పరిస్థితే.

- Gorrepati Narasimha Prasad

Posted On 13th April 2020