మొన్నటివరకూ జ్యుయలరీ‌ షాప్.. ఇప్పుడు కూరగాయల షాప్
మొన్నటివరకూ జ్యుయలరీ‌ షాప్.. ఇప్పుడు కూరగాయల షాప్

పరిస్థితులు ఎవర్ని ఎలా మారుస్తాయో ఎవరికి తెలియదు. అప్పటివరకు నగలు అమ్మిన చోట కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని కలలో కూడా అతను వూహించి ఉండడు. అది కూడా దాదాపుగా 25 ఏళ్లుగా చేస్తున్న వ్యాపారం. బంగారు నగల స్థానంలో కూరగాయలు పెట్టి అమ్ముకోవాల్సి వచ్చింది ఒక వ్యాపారికి. లాక్‌డౌన్‌ ఫలితంగా  ఆదాయం లేక ఓ చిరు నగల వ్యాపారి కుటుంబాన్ని పోషించుకునేందుకు, తన నగల దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే...

రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపుర్‌లోని రామ్‌నగర్‌లో హుకుమ్‌చంద్‌ సోని కి జీపీ జ్యుయలరీ‌ పేరుతో ఒక నగల దుకాణం ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా దుకాణం మూతపడి ఆదాయం దెబ్బతినడంతో, చేసేదేమీలేక కూరగాయలు అమ్మాలని సిద్దమయ్యాడు. మొన్నటివరకు ఎంతో విలువ కలిగిన బంగారం, వెండి ఆభరణాలు పెట్టిన చోట నేడు కూరగాయలు పెట్టి అమ్ముతున్నాడు.

దుకాణం యజమాని హుకుమ్‌చంద్‌ సోని మాట్లాడుతూ...

‘నేను ఇంతకుమునుపు బంగారు ఆభరణాలను అమ్ముతూ, వాటికి మరమ్మతులు చేస్తూ ఆదాయం పొందేవాడిని. లాక్‌డౌన్‌ వల్ల మార్చి 25 నుంచి నా నగల దుకాణాన్ని మూసిఉంచాల్సి వస్తోంది. దీంతో ఆదాయం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించేందుకు ఉన్న ఏకైక మార్గం నా దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చడమే మంచిది అనిపించింది. దీనివల్ల ఇప్పుడు ఎంతో కొంత సంపాదించగలుగుతున్నా. దుకాణానికి కిరాయి చెల్లించాలి. నా తల్లిని, చనిపోయిన నా తమ్ముడి కుటుంబాన్ని పోషించాలి. ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కదా’ అంటూ తన ఆవేదన వెల్లగక్కాడు.

Posted On 3rd May 2020

Source eenadu